Asianet News TeluguAsianet News Telugu

గెలుపులో మీకు కనిపించకున్నా ఓటమికి ఎదురు నిలబడతాం-పవన్ కల్యాణ్

  • పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న అజ్ఞాతవాసి మూవీ
  • గ్రాండ్ గా ఈ మూవీ ఆడియో విడుదల కార్యక్రమం
  • ఈ మూవీ అడియో వేడుకలో పవన్ కల్యాణ్ ఎమోషనల్ స్పీచ్ 
pawan kalyan agnyaathavaasi movie audio launch highlights

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న అజ్ఞాతవాసి చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్  హైటెక్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కేరింతల నడుమ వినసొంపైన శాస్త్రీయ సంగీతంతో వీణ వాయిద్యంతో మొదలైంది. అనంతరం మధురాపురి సదనా... పాటతో సింగర్ నిరంజన అలరించింది. సుమ యాంకరింగ్, సంగీత దర్శకుడు అనిరుథ్ లైవ్ పర్ఫామెన్స్ లతో వేడుక అద్దిరిపోయింది.

కార్యక్రమానికి హజరైన దిల్ రాజు మాట్లాడుతూ.. చినబాబు గారికి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఆల్ ద బెస్ట్.. మీరు తలుచుకుంటే రాజ్ హిరానీ సినిమాల్లా తీయొచ్చు అని చెప్పా. అంత పొటెన్షియాలిటీ వున్న డైరెక్టర్ త్రివిక్రమ్. ఆది వస్తేనే ఇలా వుంది. కళ్యాణ్ గారు వస్తే ఎలా వుంటుంది. ఈ సినిమా పక్కా హిట్ అవుతుంది అంటూ ముగించారు.

తనికెళ్ల భరణి మాట్లాడుతూ...పవన్ అభిమానుల గోలతో నా మాట నాకే వినపడట్లేదు. నేను మూడు ముక్కలు మాట్లాడుదామని వచ్చా. మూడే ముక్కలు మాట్లాడుతా. మూడు ముక్కలు పవన్ కల్యాణ్, పవన్ కల్యాణ్, పవన్ కల్యాణ్. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ చిత్రం అజ్ఞాతవాసిలో నేను నటించడం అదృష్టం. ఇది చరిత్ర సృష్టిస్తుంది. నా కవిత అతని కోసం.. అతగాడు మితభాషి. నిత్య సత్యాన్వేషి. అర్జనుని వంటి ఒక అజ్ఞాతవాసి.

బొమన్ ఇరానీ మాట్లాడుతూ... అత్తారింటికి దారేది నా ఫస్ట్ ఫిలిం. అది కెరీర్ లో నాకు చాలా సంతోషమిచ్చిన సినిమాల్లో ఒకటి. నన్ను నటించమని అడగటం కోసం వచ్చినప్పుడు హీరో పేరు ఏంటని అడగ్గా... పవన్ కల్యాణ్ అన్నారు. దర్శకుడు ఎవరు అని అడిగా... త్రివిక్రమ్ అన్నారు. వెంటనే మరో ప్రశ్న అడక్కుండా... నేను అంగీకరించాను. ఇక సినిమాలో భరణి, రావు రమేష్, మురళీ శర్మ లాంటి వాళ్లు వున్నారు. ఖుష్బూ లాంటి వాళ్లు నేను గర్వ పడుతున్నా. నాకు ఈ మూవీలో ముసలోడి పాత్ర ఇచ్చారు. ప్రతి సినిమాలో అదే ఇస్తున్నారు. కానీ నిజం చెప్తున్నా... నేను ముసలివాన్నయినా తెలుగులో నటిస్తాను. హైదరాబాద్ నన్ను దత్తత తీసుకుంది అన్నారు.

వేణు గోపాల్ ఇసుకతో వేసిన ఆర్ట్ లో సుస్వాగతం వేయగా.. పవన్ కళ్యాణ్ అదే సమయంలో ఎంట్రీ ఇచ్చారు. ఇక తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, గబ్బర్ సింగ్, అతత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి లాంటి హిట్ సినిమాల పోస్టర్ల్ ను ఆర్ట్ ద్వారా చూపించి ఆకట్టుకున్నాడు వేణుగోపాల్.

ఇక సిరివెన్నెల సీతారమయ్య శాస్త్రి మాట్లాడుతూ.. నన్ను కూర్చోని కేరింతలు కొట్టకుండా స్టేజీ మీదకు పిలిచారు. పవన్ కల్యాణ్ గురించి ఏం చెప్పాలి.. సునామి ఎదురుగా వచ్చి నిలబడితే, తుపాను తలుపులు తడితే.. ఎలా వుంటుందో తెలియాలంటే చూడరా వీడో హ్యూమన్ సునామీ... అనే నేను రాసిన డైలాగ్ పవన్ కు సరిగ్గా సరిపోద్ది. అలాంటి సందర్భంలో నేను మాట్లాడటం సునామీలో పిల్లనగ్రోవి వాయించటం లాంటిది. బాధ్యత వుంది గనుక..రెండు ముక్కలు.. నిర్మాత రాథాకృష్ణ గారికి హార్దికాభివందనాలు. పేరుకే వపన్, కానీ మహా ప్రభంజనం, అయితే అది కల్లోలం కాదు, కల్యాణ్ కలిగించే ప్రభంజనం. పైగా త్రివిక్రమ్ సంధించి విసిరిన పవనాస్త్రం, కల్యాణాస్త్రం. ఇక అజ్ఞాతవాసి ఆనందపు జడిని వర్షించి హిట్ గా నిలవబోతోంది. అనిరుథ్ కు తెలుగు పరిశ్రమకు ఆదర స్వాగతం. గీత రచయితలు భాస్కర భట్ల, శ్రీమణికి శుభాకంక్షలు. నాచేత పాటలు రాయించినందుకు కృతజ్ఞతలు. థాంక్యూ పవన్, థాంక్యూ త్రివిక్రమ్ అంటూ ముగించారు.

ఇక ఖుష్బూ మాట్లాడుతూ... పదేళ్ల తర్వాత చేశాను, స్టాలిన్ తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ చేస్తే పెద్ద రోల్ చేయాలి. ప్రాధాన్యత వున్నవే చేస్తా అనుకున్నా. త్రివిక్రమ్ గారు నాకు కథ చెప్పినప్పుడు కాదనటానికి కారణం కనబడలేదు. నేను పవన్ కల్యాణ్ సినిమాతో తిరిగి తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వటం సంతోషం. నాకు అవకాశమిచ్చిన త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు. నాకు సాధారణంగా దర్శకులతో సెట్ కావటానికి టామ్ పడుతుంది. కానీ త్రివిక్రమ్ తో పెద్దగా పట్టలేదు. ఇక పవన్ కల్యాణ్ పవర్ స్టార్ అనే ఇమేజ్ వున్నా... సూపర్ స్టార్ అయినా చాలా సాధారణంగా వుంటారు. తెలుగులో ఈ సినిమాతో తిరిగి రావటం సంతోషం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ గా. బిగెస్ట్ ధమాకా ఆఫ్ తెలుగు ఫిల్మ్.. అజ్ఞాతవాసి రాబోతోంది. అభిమానులకు సంక్రాంతి పండగ సుభాకాంక్షలు అంటూ ముగించారు.

ఇక రావు రమేష్ మాట్లాడుతూ నితిన్ గారు పవన్, త్రివిక్రమ్ గారికి శుబాకాంక్షలు చెప్పమన్నారు. ఇక నేను నాన్న గారిలా గొప్ప పేరు తెచ్చుకోవాలని దేవుణ్ణి కోరుకునే వాన్ని. కానీ ఇప్పుడు దేవున్ని కోరికలు కోరడం మానేశా. ఈ రోల్ నాకు అంత తృప్తినిచ్చింది. ఇక ఈసారి ఎక్కువ రోజులు షూటింగ్ చేశాను. రిలీజ్ కు ముందే కొట్టాడు అభిమానుల హృదయాలు లూటీ. దట్స్ ద బ్యూటీ.

ఆది మాట్లాడుతూ... నేను పవన్ కల్యాణ్ కు చిన్నప్పటి నుంచే ఫ్యాన్ ను. మా ఇంటికి వచ్చినప్పుడు ఎల్.ఈ.డీ ప్లేయర్ తెచ్చాం. కనెక్ట్ చేయటం రాలేదు. ఆయన ఓపిగ్గా అన్నీ సెట్ చేసి ఇచ్చారు. దాంతో జురాసిక్ పార్క్ మూవీ చూయించటం జరిగింది. ఆయనతో పని చేసే అవకాశం ఇచ్చినందుకు త్రివిక్రమ్ గారికి థాంక్స్. ఈ మూవీలో ఇంకా స్టైలిష్, ఇంకా పవర్ ఫుల్, ఇంకా యంగ్ గా పవన్ కల్యాణ్ ను చూడబోతున్నారని అన్నారు.

అను ఎమాన్యుయెల్ మాట్లాడుతూ... ఇది పెద్ద సినిమా అని చెప్పట్లేదు. కానీ పండగకు వస్తోంది. మీకు నచ్చుతుంది. పవన్ సర్ పక్కన నిలుచోవటమే గొప్ప. అలాంటిది నటించడం నాకు హానర్. త్రివిక్రమ్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. మీతో మళ్లీ మళ్లీ పని చేయాలని కోరుకుంటున్నా. కాంప్రమైజ్ అవకుండా నిర్మాతలు అందించిన సహకారం మరువలేనిది. అనిరుథ్ కు అద్భుతమైన సంగీతం అందించినందుకు థాంక్స్. తెలుగులో అతని డెబ్యూ బాగుంది. కీర్తి ఆల్ ద బెస్ట్. నైస్ వర్కింగ్ విత్ యు. ఈ సినిమాలో పనిచేసిన అందరు టెక్నీషియన్స్, ఏడీలకు థాంక్స్.. మీరే లేకుంటే నేనింత చేసేదాన్ని కాదు. మీ అందరికీ థాంక్స్.అంటూ ముగించింది.

కీర్తి సురేష్ మాట్లాడుతూ... నిర్మాత చినబాబు గారికి థాంక్స్. వంశీ సారుకు థాంక్స్. త్రివిక్రమ్ గారు చాలా కూల్.  పవన్ కల్యాణ్ గారికి థాంక్స్. నాకు ఈ కేరక్టర్ ఇచ్చినందుకు. ఇక పెన్సిల్ లాగా వున్న అనిరుథ్ ఇచ్చే సంగీతం అద్భుతం. సినిమాటోగ్రఫర్ మణి సార్ కు థాంక్స్. ప్రతీ ఫ్రేమ్ పెయింటింగ్ లా వుంది. ఇక అనుతో నాకు మంచి కెమిస్ట్రీ వుంది. స్టార్ అవటం అంటే మామూలు కాదు. పవర్ స్టార్ అవటమంటే అస్సలు మాటలు కాదు. మా అమ్మ మేనక గారు చిరంజీవి గారితో పున్నమినాగులో చేసింది. నేను ముందు పవన్ కల్యాణ్ కు స్క్రీన్ ఫ్యాన్ వుండే. ఇప్పుడు పర్సనల్ గా కూడా పవన్ ఫ్యాన్ అయిపోయానంది కీర్తి.

త్రివిక్రమ్ మాట్లాడుతూ... నిశ్శబ్దంగా వుంటే మాట్లాడుకుందాం అంటూ మొదలు పెట్టి... లోపలికొచ్చేటప్పుడు మనోళ్లకి దెబ్బలు తగిలాయట. జాగ్రత్తగా వుండిండి. బైక్ లో వెళ్లే వాళ్లు నెమ్మదిగా వెళ్లండి, కార్లో వచ్చినోళ్లు జాగ్రత్తగా వెళ్లండి. బస్సుల వెంట పరుగెత్తకండి. మనందరం ఆయన వెనకాల వుండాలి కదా. ఒక్క నెంబరు కూడా తగ్గొద్దు కదా అంటూ మొదలు పెట్టి... ఈ సినిమా గురించి మాట్లాడే ముందు... ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటూ ప్రారంభించారు. సినిమాతప్ప వేరే పని తెలియని మణికన్నన్ గారు... ఆయన దగ్గర్నించి చాలా నేర్చుకున్నాం. నేను కొంచమే చెప్పాను. ఆయన ఇంత చూపించారు. అందరూ నిశ్సబ్దంగా వినాలి. ఏ ఒక్కడూ తక్కువ కాదు. కళా దర్శకుడు ప్రకాష్ గారు.. ఇబ్బందులున్నా భరించి నాతో పనిచేశారు. ప్రకాశ్... ధాంక్స్. అనిరుధ్.. గతంలోనే చేయాలనుకున్నాం. కానీ ఈ సినిమాతో కుదిరింది. అనిరుధ్ కు భయం లేకపోవటం నేర్చుకున్నా. బొమన్ ఇరానీ గారితో మళ్లీ మళ్లీ పనిచేయాలని కోరుకున్నా. ఆయనతో కెమెరా వెనుక లైబ్రరీ లాంటి వారు. రచయిత కూడా వున్నాడు ఆయనలో. ఆయన నన్ను ప్రతి సీన్ లోనూ పుష్ చేస్తారు. మరింత మంచి రచయితను అవటానికి ప్రోత్సహించిన బొమన్ ఇరానీ గారికి థాంక్స్. తనికెళ్ల భరణి గారు.. నా మొదటి సినిమాలో ఆయన వుండాలి.అప్పుడే నన్ను గొప్పగా ట్రీట్ చేశారు. ఇప్పుడంటే నన్ను దర్శకుడిగా ట్రీట్ చేయటం మానేశారు. మనలో వున్న శక్తిని వెలికితీసే భరణి గారిలాంటి వాళ్లను చూస్తే శక్తి వస్తుంది.

ఇక రావు రమేష్ గారు... ఎస్వీ రంగారావు మహానటుడు. నట పర్వతం, సావిత్రి గారు. వాళ్లిద్దరి తర్వాత రావుగోపాలరావుగారినే అభిమానిస్తాను. అలాంటి ఆన కుమారుడు రావు రమేష్ గారితో పనిచేశాను. ఇద్దరం ఒకేసారి ప్రయాణం మొదలు పెట్టాం. వీళ్లమ్మ గారు పండితురాలు. ఆయన పండిత పుత్రుడు. సంస్కారం, సంస్కృతి రెండు కలిస్తే రావు రమేష్. ఫైట్ మాస్టార్ రవివర్మ, నన్ను భరించినందుకు కృతజ్ఞతలు. ఇక ఖుష్బూ గారికి నేను కథ చెప్పటానికి చెన్నై వెళితే నేను చేస్తున్నా. ఏం చెప్పక్కర్లేదు. వాళ్లు డబ్బింగ్ చెప్పుకునేంతగా తెలుగు నేర్చుకున్నారు. ఎక్కడో వేరే రాష్ట్రంలో, వేరే దేశంలో పుట్టి మన భాషను నేర్చుకున్నందుకు గౌరవిస్తున్నా. నిర్మాత కూడా ఏ మాత్రం తగ్గకుండా ఖర్చుపెట్టారు. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ, పీడీప్రసాద్ గార్లకు.. అందరికీ ధన్యవాదాలు. మాటలు రాసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారికి ధన్యవాదాలు. ఈ మధ్య తెలుగు పాటకు వన్నెతెచ్చిన ఆయన రాసేంత పాటలు నా సినిమాలో వుండట్లేదు. ఒక కవిలో యువకుడు ఎప్పటికీ బతికే వుంటాడని గాలివాలుగా పాటలో సిరివెన్నెల ప్రూవ్ చేశారు.ఇక నాతో ఆరడుగుల బుల్లెట్ తో మొదలు పెట్టిన... శ్రీమణితో జర్నీ కూడా మరువలేనిది అన్నారు.

పవన్ కల్యాణ్ గారికి రెండు నిమిషాలు కథ చెప్పాను. అప్పుడు ఇటలీలో వున్నారు. ఈ సినిమా మనం చేస్తున్నామని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఈ మూవీలో కల్యాణ్ గారి నటవిశ్వరూపం చూస్తారు. ఆయనపై మన మనసులో వున్న ఇష్టాన్ని పదే పదే బయటపెట్టుకోవద్దు. అమ్మ ఎంతిష్టమో.. కల్యాణ్ గారు అంతకంటే ఇష్టం. పదే పదే చెప్పుకోవటం బాగోదు. మీరందరూ కోరుకునే ఉన్నతస్థాయికి ఆయన చేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.. ఇక మరోసారి.. బిఎన్ రెడ్డి నుంచి రాజమౌళి దాకా, సంగీత దిగ్గజాలు దక్షిణా మూర్తి నుంచి నేటి అనిరుధ్ వరకు, ఇలా ఈ సినిమాకు పని చేసిన, పరిశ్రమ కోసం పనిచేసిన ఎందరో మహాను భావులు అందరికీ వందనాలు అంటూ ముగించారు.

 

ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ...

భారత్ మాతా కీ జై అంటూ తన ప్రసంగం ప్రారంభించిన పవన్ కల్యాణ్... రాలేకపోయిన మన అభిమానులందరికీ, స్థలం చిన్నదవటం వల్ల బైట ఇరుక్కుపోయిన వాళ్లకి నా క్షమాపణలు. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకోవాలని వుంటుంది. కానీ నా శరీరం చిన్నది. అభిమానించే ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నేను వచ్చినప్పుడు ఇంత అభిమానాన్ని సంపాదిస్తాననని అనుకోలేదు. చిన్నప్పటి నుంచి సమాజానికి ఉపయోగపడే పనిచేస్తే చాలనుకునేవాన్ని. సినిమాల ద్వారా మీకింత చేరువైనందుకు.. నా వంతుగా రాజకీయ పార్టీ ద్వారా సేవ చేసుకునే భాగ్యం కలిగించిన మీకు, సినీ కళామతల్లికి నా వందనాలు. నేను పదో పన్నెండో సినిమాలు చేసి వెల్దామనుకున్నా(దేశ సేవకు). దానికి కారణం దేశం చాలా గొప్పది. చాలా పెద్దది అనే ఫీలింగ్. మీ ప్రేమ వల్ల పాతిక సినిమాలు చేశాను. ఈ పాతిక సినిమాల్లో జానీ సినిమా తర్వాత నేను ఓటమికి భయపడలేదు,గెలుపుకు పొంగి పోలేదు. కానీ మనకు సంబంధం లేకుండా మన పని అసూయను, ద్వేషాలను ఇస్తుందని సినిమాల ద్వారా తెలుసుకున్నాను. సినిమాల నుంచి తప్పుకోవటానికి నేను ఎప్పుడూ సిద్ధం. నా చుట్టూ వుండే వాళ్లు ఫెయిల్ అయినప్పుడల్లా బాధపడటం గమనించాను. నాకు విరక్తి వైరాగ్యం వచ్చింది. వెళ్లిపోదామనుకున్నా. కానీ నన్ను మీరు బతికించారు. నేను అండగా నిలిచినవాళ్లు నాకెప్పుడూ నిలవలే కానీ... మీరు నిలబడ్డారు. మీకోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటుంది. ఎడిసన్ బల్బ్ తయారు చేసిన క్రమంలో విఫలమైనప్పుడు మరోలా ప్రయత్నించాలనుకున్నారు. సక్సెస్ అయ్యారు. నాకు భారతదేశపు జెండా చూసినప్పుడల్లా గుండె ఉప్పొంగుతుంది. ఆ జెండా కోసం, ఈ దేశం కోసం రాజకీయాల్లోకి వెళ్లాను తప్ప వేరే ఉద్దేశం లేదు. శక్తి, వయసు వుండగానే సమాజానికి ఉపయోగపడాలనేది నా భావన. నా వంతుగా ఉడత సాయమైనా దేశానికి చేస్తాను. మీరు ఎంతగా నా గురించి ఓడిపోవద్దని కోరుకున్నారో నాకు తెలుసు.  జరిగేదంతా కాలానుగుణంగానేనని, నేను నిమిత్తమాత్రున్నని తెలుసు. నాకు శక్తి లేని సమయంలో, భయం, నిరాశ, నిస్పృహలో వున్నప్పుడు... ఎవరూ నా వెంట లేరు. మీరు తప్ప(అభిమానులు).

మీలోంచి ఎవరైనా దర్శకుడు అయితే అదే త్రివిక్రమ్. నాకు జల్సా అనే సినిమా ఆడింది డబ్బులు వచ్చాయని కూడా నాలుగేళ్ల దాకా తెలియదు. అలాంటి సినిమాతో నన్ను తిరిగి మీకు దగ్గర చేసిన దర్శకుడు త్రివిక్రమ్. తను నేను దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లం. ఆయన ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్. నాలాంటి వాడి అవసరం ఆయనకు లేదు. నా రక్తం పంచుకున్న వారిని కూడా కోప్పడను కానీ.. త్రివిక్రమ్ గారిని కోప్పడగలను. మీతో ఎంత హృదయం పంచుకోగలనో ఆనతో అంతే పంచుకోగలను. నిరాశకు లోనైనప్పుడు కవితలు చెప్పి ఉత్తేజ పరిచారు. ఆయనకు నాకు పరిశ్రమ అంటే గౌరవం. మేం సినిమాలు ఆఢినా ఆఢకున్నా పట్టించుకోం. మేం గెలుపులో కనిపించకపోవచ్చు కానీ.. ఓటమిలో మేం నిలబడతాం. ప్రపంచంలో ప్రతి సమస్య నా సమస్య అనుకునే వాన్ని కానీ ఏం చేయలేని నిస్సహాయుడిగా వుండేవాన్ని,కేవలం బాధ పడేవాన్ని. కానీ వెన్నుతట్టి నన్ను త్రివిక్రమ్ ప్రోత్సహించారు. ఒక పుస్తకం తీసుకొచ్చి ఇచ్చారు. అది చదివితే డిప్రెషన్ పోయింది. నాకు గుంటూరు శేషేంద్ర శర్మను పరిచయం చేసిన వ్యక్తి త్రివిక్రమ్. అందుకు కృతజ్ఞతలు.

ఇక నేనెప్పుడూ నాది మంచి సినిమా చూడండి అని చెప్పను. కానీ.. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నానన్నారు. నిర్మాత రాథాకృష్ణ గురించి మాట్లాడుతూ... డిస్ట్రిబ్యూటర్లకు అండగా వుండాలనే పాతకాలపు విలువల్ని నిలబెడుతున్న నిర్మాత రాథాకృష్ణ గారికి థాంక్స్ అన్నారు. అనిరుథ్ కొలవెరి పాటకు డాన్స్ వేశానన్నారు పవన్. మైకేల్ జాక్సన్ తర్వాత అంత ఇష్టమైన సంగీత దర్శకుడు అనిరుథ్ అన్నారు. ఇక ఆది గురించి చెప్పాలంటే.. వాళ్ల నాన్న గారితో నా మొదటి సినిమా చేయాలి. కానీ కుదరలేదు. ఆదితో పనిచేయటం, ఖుష్బూ గారితో, బొమన్ ఇరానీ, మురళి శర్మ, తనికెళ్ల భరణిగారు ఇలాంటి మహానుభావులతో నటించడం నిజంగా గొప్ప విషయం. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్లు ఈ సినిమాలో కలిసి పనిచేశాం. ఇంతమందిని కలిసే అకాశమిచ్చిన ఈదేశానికి వందనం. జైహింద్ జైహింద్ అంటూ ముగించారు.

ఇక ఈ ఆడియో వేడుకలో 5 పాటలు రిలీజ్ అయ్యాయి. పవన్ కల్యాణ్ పాడిన పాటను సర్ ప్రైజ్ రిలీజ్ కోసం పెట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios