పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణుదేశాయ్.. సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ నుంచి విడిపోయిన తర్వాత ఆమె పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఓ డ్యాన్స్ రియాల్టీ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఒంటరిగా జీవించడం చాలా కష్టమని, తన పిల్లలను చూసుకోవడానికి ఎవరైనా తోడు ఉంటే బాగుంటుందని ఆమె వ్యాఖ్యానించారు.

 

దీంతో.. రేణు దేశాయ్ మరో పెళ్లికి సిద్ధమైందంటూ వార్తలు వెలువడ్డాయి. దీంతో పవన్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ రేణు కి మెసేజీలు చేశారు. మరో పెళ్లి చేసుకుంటే మీ గౌరవం తగ్గుతుందని కొందరు, మిమ్మల్ని అసహ్యించుకుంటామని మరికొందరు కామెంట్లు చేయడంపై రేణు వాటిని స్క్రీన్ షాట్లు తీసి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఆ పోస్ట్ వైరల్‌గా మారింది.

 

'ఈ పోస్ట్ కేవలం నన్ను ఉద్దేశించింది  అని నేను అనుకోవడం లేదు. కానీ.. ఇలాంటి కామెంట్స్ చదివినప్పుడు..  మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న మగవాళ్ల మధ్య బతుకుతున్నాం అని చాలా ఆందోళనగా అనిపిస్తుంది. సమాజంలో ఓ వైపు ఉమెన్ ఈక్వాలిటీ, ఆడపిల్లల శక్తి , అత్యాచారాల నుంచి మహిళలను కాపాడాలి. వారి భద్రత గురించి మాట్లాడుతున్నాం. ఇంకో వైపు  నేను  ఒంటరిగా ఉండి 7ఏళ్లు.  ఇప్పుడు నాకు ఒక లైఫ్ పార్టనర్ ఉంటే బాగుండు అని జస్ట్ ఎక్స్ ప్రెస్ చేసినందుకు నాకు హేట్ మెసేజీలు పంపుతున్నారు.

 

మన దేశంలో ఓ మగాడు ఏమైనా చేయొచ్చు. ఎన్నిసార్లయినా పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఓ అమ్మాయి మరో రిలేషన్ గురించి ఆలోచించడం కూడా తప్పు. తను జీవితాంతం తప్పు చేశానన్న భావనతో  ఒంటరిగా బతకాలా ? ఇవాళ నేను దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. మన దేశంలో అమ్మాయిల భవిష్యత్తు మెరుగ్గా ఉండాలంటే, తల్లులు వాళ్ల కొడుకులను పద్ధతిగా పెంచాలి. అప్పుడైనా మగవాళ్ల ఆలోచనా విధానంలో మార్పు వస్తుందేమో' అంటూ రేణు దేశాయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.