సెప్టెంబరు 2వ తేదీన అంటే ఈ రోజు  సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాల్లో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. #HBDPawanKalyan అనే హ్యాష్‌ ట్యాగ్‌ ఇప్పటికే ట్రెండింగ్‌లోకి వచ్చింది.

మరోవైపు, పవన్‌ కొత్త సినిమాలకు సంబంధించి బుధవారం వరుస అప్‌డేట్‌లు రానున్నాయి. ఈ నేపథ్యంలో పవన్‌కు శుభాకాంక్షలు చెబుతూ జ‌న‌సేన పార్టీ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ నికి చెందిన  చైతన్య... ప‌వ‌న్ సైకత శిల్పాన్ని రూపొందించారు. వంశధార నది, సాగరతీరం కలయిక ప్రాంతమైన కళింగపట్నం సముద్ర తీరంలో ఇసుక‌తో ప‌వ‌న్ రూపాన్ని తీర్చిదిద్దారు. ప్ర‌స్తుతం ఈ సైక‌త శిల్పం చూపరులను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది.
 
ఇదిలా ఉంటే పవన్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ అలరిస్తుండగా, తాజా మోషన్‌ పోస్టర్‌ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. సాఫ్ట్‌బాల్‌ స్టిక్‌ పట్టుకుని పవన్‌ నిలబడిన పోస్టర్‌ ఆకట్టుకుంటోంది.

శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్‌’ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాల్సి ఉంది. అయితే, కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ‘వకీల్‌సాబ్‌’ పరిస్థితులు అనుకూలించిన తర్వాత సెట్స్‌పైకి వెళ్లనుంది.