ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ యూట్యూబ్ వేదికగా కొత్తగా విడుదలైన చిత్రాల గురించి తన అభిప్రాయం చెబుతున్నారు. తాజాగా పరుచూరి.. నాని నటించిన జెర్సీ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. ఇటీవలే జెర్సీ చిత్రాన్ని చూశానని.. ఇంతటి అద్భుతమైన చిత్రంలో నటించినందుకు నానికి ముందుగా ధన్యవాదాలు చెబుతున్నట్లు పరుచూరి అన్నారు. 

సాధారణంగా ఇలాంటి కథల్ని మంచి ఇమేజ్ ఉన్న హీరోలు ఒప్పుకోరు. ఈ సినిమా ప్రారంభంలో చూస్తున్నపుడు నిజంగానే ఇది విజయం సాధించిందా అని అనిపించింది. కానీ చివర్లో దర్శకుడు, హీరో గుండె బరువెక్కేలా చేశారు. చాలా అద్భుతమైన చిత్రం జెర్సీ అని పరుచూరి ప్రశంసించారు. 

హీరో చనిపోతాడని కొడుకు పాత్ర సినిమా ప్రారంభంలోనే చెప్పి మంచి పని చేశారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు. కొడుక్కి రూ 500 తో జెర్సీ కొనివ్వలేని తండ్రి కథ ఇది. ఇలాంటి కథని ఏ హీరో ఒప్పుకునే సాహసం చేయరు. నాని ఎందుకు ఒప్పుకున్నాడు అని అనుకున్నా. కానీ సినిమా చాలా హార్ట్ టచింగ్ గా ఉంది. 

ఈ చిత్రంలో నానితో పాటు అతడి కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ చాలా బాగా చేశాడు. హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్, సత్యరాజ్ పాత్రలు కూడా కథకు బలాన్ని చేకూర్చాయి అని పరుచూరి తెలిపారు. ఈ చిత్రంలో హీరో పాత్రలో హీరోయిజం లేకపోవచ్చు కానీ కథలో హీరోయిజం ఉందని అన్నారు.