కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సభ్యుల్లో ప్రతి ఒక్కరు గట్టి పోటీ ఇస్తుండడంతో చివరివరకు ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ నటి హేమ తొలి వారమే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. 

ఇంటి సభ్యులతో ఆమె వాదనకు దిగడం, అనవసరంగా పెద్దరికం చలాయిస్తుండడంతో ఆడియన్స్ లో హేమపై వ్యతిరేకత పెరిగింది. తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.. హేమ ఎలిమినేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ పై తనదైన శైలిలో స్పందించారు. పరుచూరి పలుకులు పేరుతో ఆయన సినిమాలకు విశ్లేషణ అందిస్తున్న సంగతి తెలిసిందే. 

అప్పుడప్పుడూ ఇతర అంశాలని కూడా ప్రస్తావిస్తుంటారు. బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ.. హేమ నాకు 14 ఏళ్ల చిన్న అమ్మాయి వయసు నుంచి తెలుసు. ఆమె రూపం చూసి హీరోయిన్ అవుతుందనుకున్నా. హీరోయిన్ కాలేకపోయినా అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయింది. పలు సందర్భాల్లో మహిళల కోసం మీడియాని సైతం ఎదిరించింది. దీనితో తనకు హేమపై గౌరవం పెరిగిందని పరుచూరి అన్నారు. 

అలాంటి హేమ బిగ్ బాస్ షోకు వెళ్లి తొలి వారమే ఎలిమినేట్ కావడం బాధించింది అని పరుచూరి అన్నారు. బిగ్ బాస్ షో రూల్స్ ఎలాగైనా ఉండొచ్చు.. కానీ తొలి వారమే ఎలిమినేషన్ లేకపోతే బావుంటుంది. ఇంటి సభ్యులని ఒకరిని ఒకరు అర్థం చేసుకునేందుకు కనీసం రెండు వారాల సమయం అయినా ఇవ్వాలి. కేవలం ఆడియన్స్ వేసిన ఓట్లు తప్ప హేమని ఎలిమినేట్ చేయడానికి ఎలాంటి కారణం లేదు. 

అలా కాకుండా తొలి వారంలో కెప్టెన్ అయ్యేందుకు ఇంటి సభ్యుల మధ్య పోటీ నిర్వహించాల్సింది అని పరుచూరి అభిప్రాయపడ్డారు.