బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా తీవ్ర మానసిక వేదనకు గురయ్యాయని చెప్పారు. ఒకానొక సమయంలో తన దగ్గర కనీస అవసరాలకు కూడా డబ్బు లేక ఎంతో ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ 2014 నుండి 2015 మధ్య కాలంలో తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు చెప్పింది.

తను నటించిన 'దావత్‌-ఎ-ఇష్క్‌', 'కిల్‌ దిల్‌' సినిమాలు సరిగ్గా ఆడలేదని.. అది తన జీవితంలో కఠినమైన సమయమని.. ఒక్కసారిగా అవకాశాలు తగ్గి చేతుల్లో డబ్బు లేని పరిస్థితి నెలకొందని తెలిపింది. కొత్తగా ఇల్లు కొనడంతో పాటు, పెద్ద సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంతో ఉన్న డబ్బు కూడా అయిపోయిందని.. సమయానికి ఒక్కరూపాయి కూడా అందలేదని.. తన జీవితంలో అదొక పెద్ద కుదుపు అంటూ చెప్పుకొచ్చింది. 

రోజుకి పదిసార్లు గుక్కపెట్టి, గుండెపగిలేలా ఏడ్చేదాన్ని అంటూ తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. స్నేహితులకు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండేదాన్ని అని తెలిపింది. ఓ గదిలో తనను తను బంధించుకొని.. వారాల కొద్దీ ఎవరినీ కలవకుండా ఒంటరిగా బ్రతికేదట.

ఆ సమయంలో తన సోదరుడు సహజ్, తన స్టైలిస్ట్ సంజనా బాత్రా తనపై శ్రద్ధ తీసుకొని.. డిప్రెషన్ లో ఉన్న తనను బయటపడేలా చేశారని.. వారి కారణంగా మామూలు మనిషి అయ్యానని చెప్పుకొచ్చింది. డిప్రెషన్‌కు మనిషి ప్రాణాలు తీసే శక్తి ఉంటుందని.. కాబట్టి మన వాళ్లు ఎవరైనా అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నట్లయితే నిరంతరం వారిని గమనిస్తూ..కాపాడుకోవాలని చెప్పారు.