రివ్యూ: పేపర్ బాయ్

రచయితగా, దర్శకుడిగా తన సత్తా చాటిన సంపత్ నంది నిర్మాతగామారి సినిమాలు కూడా నిర్మించడం మొదలుపెట్టాడు. ఆయన అనుకున్న కథలను మరొకరితో డైరెక్ట్ చేయించి వారికి అవకాశాలు ఇస్తున్నాడు. 

paper boy telugu movie review

నటీనటులు: సంతోష్ శోభన్, తాన్యా హోప్, రియా సుమన్ తదితరులు 
సంగీతం: భీమ్స్ 
సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ 
ఎడిటింగ్: తమ్మిరాజు 
నిర్మాతలు: సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ 
కథ-మాటలు: సంపత్ నంది 
దర్శకత్వం: జయ శంకర్

రచయితగా, దర్శకుడిగా తన సత్తా చాటిన సంపత్ నంది నిర్మాతగామారి సినిమాలు కూడా నిర్మించడం మొదలుపెట్టాడు. ఆయన అనుకున్న కథలను మరొకరితో డైరెక్ట్ చేయించి వారికి అవకాశాలు ఇస్తున్నాడు. తాజాగా సంపత్ నంది అందించిన కథను సినిమాగా తెరకెక్కించి దర్శకుడిగా పరిచయమయ్యాడు జయశంకర్. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
మేఘా(తాన్యా హోప్)కి నిశ్చితార్ధం జరిగే రోజున తనొక జబ్బుతో బాధ పడుతుందని తెలుసుకుంటుంది. మరికొద్దిరోజుల్లోనే ఆమె చనిపోతుందనే విషయాన్ని ఆమె కుటుంబం  జీర్ణించుకోలేకపోతుంది. తన జీవితానికి ఓ పర్పస్ ఉంటుందని ఆలోచించే మనిషి మేఘా. తన కారణంగా ఏదొక పని జరగడానికే దేవుడు తనను పుట్టించాడని నమ్ముతుంది. ఈ  క్రమంలో ఆమెకు ఒక డైరీ దొరుకుతుంది. అందులో రవి అనే పేపర్ బాయ్ తన ప్రేమకథను రాసుకుంటాడు. పేపర్ బాయ్ అయినప్పటికీ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం  వెతుకుతుంటాడు.

అతడు రోజు పేపర్ వేసే ఇంట్లో ధరణి(రియా సుమన్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. రవి నిజాయితీ నచ్చి ధరణి కూడా అతడిని ఇష్టపడుతుంది. ధరణి సంపన్న  కుటుంబానికి చెందిన వ్యక్తి. కానీ రవి పేదవాడని తెలిసి కూడా ప్రేమిస్తుంది. తమ ప్రేమను ఇంట్లో వాళ్లకి చెప్పి వాళ్లని కూడా ఒప్పిస్తుంది. ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. కానీ సడెన్ గా రవి.. ధరణికి దూరమవుతాడు. రవి ఎక్కడకి వెళ్లాడో తెలియక ధరణి అతడి కోసం ఎదురుచూస్తూ ఉండిపోతుంది. అసలు రవి బ్రతికే ఉన్నాడా..? ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి రవి ఎందుకు దూరం కావాలనుకున్నాడు..? వీరిద్దరినీ మేఘా ఎలా కలిపింది..? అనేదే సినిమా. 

విశ్లేషణ: 
ఓ గొప్పింటి అమ్మాయి, తనకన్నా తక్కువ స్థాయి అబ్బాయిని ప్రేమించడం.. పెద్దలు వీరి పెళ్లికి నిరాకరించడం.. చివరికీ ప్రేమికులిద్దరూ ఒక్కటి కావడం చాలా సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. స్థాయి బేధాలతో ప్రేమికులను పెద్దలు విడదీయడమనే కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో మాత్రం పెద్దలు పెళ్లికి ఒప్పుకున్నా.. అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయికి ఎందుకు దూరం అవ్వాలనుకున్నాడనే పాయింట్ ని కొత్తగా చూపించాలని అనుకున్నాడు దర్శకుడు. కొంత వరకు ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేకపోయాడు. ప్రేమకథల నుండి ఏమైతే ఆశిస్తామో.. ఈ సినిమాలో అది మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. ఇద్దరి మధ్య లవ్ స్టోరీని తెరపై ఇంకా బాగా చూపించొచ్చనే భావన కలుగుతుంది.

సినిమాకు మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే.. లీడ్ పెయిర్. తెరపై సంతోష్, రియాల జంట అసలు సెట్ కాలేదు. హీరో కంటే హీరోయిన్ చాలా పెద్దదిగా కనిపించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదు. దీంతో వాళ్లు ప్రేమ గురించి, బంధాల గురించి ఎన్ని డైలాగ్స్ చెబుతున్నా.. ఆడియన్స్ కి పెద్దగా ఎక్కవు. సినిమాను రియలిస్టిక్ గా చిత్రీకరించాలని ప్రయత్నించినప్పటికీ వర్కవుట్ కాలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ తో గడిచిపోతుంది. సెకండ్ హాఫ్ లో పెళ్లి అనుకునేలోపు కథలో చిన్న ట్విస్ట్. రౌడీలు, ఫ్యామిలీ గొడవలు అని కాకుండా సింపుల్ గా పరిస్థితులను వాడుకుంటూ చిన్న కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడం బాగుంది. అయితే కథ మొదలైన పది నిమిషాలకే సినిమా స్టోరీ అందరికీ అర్ధమైపోతుంది.

దీంతో నెక్స్ట్ ఏం జరగబోతుందనే విషయంపై ఆసక్తి కలగదు. సినిమాలో ఫ్రేములన్నీ కలర్ ఫుల్ గా కనిపిస్తున్నా.. యూత్ కథకు కనెక్ట్ కావడానికి టైమ్ పట్టేస్తుంది. సెకండ్ హాఫ్ లో ఇద్దరూ కలుసుకుంటారా..? లేదా..? అనే క్యూరియాసిటీని కలిగించలేకపోయారు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఏవరేజ్ గా అనిపిస్తుంది. సంపత్ నంది రాసుకున్న కథ, డైలాగ్స్ రొటీన్ గా ఉన్నప్పటికీ దర్శకుడు జయశంకర్ మేకింగ్ ని మాత్రం మెచ్చుకోవాల్సిందే. ముఖ్యంగా పాటల చిత్రీకరణలో సంపత్ నంది మార్క్ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది.

ఈ సినిమాకు మెయిన్ అసెట్స్ సంగీతం, సినిమాటోగ్రఫీ. మెలోడీ సాంగ్స్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ పై ఇంకాస్త శ్రద్ధ తీసుకొని ఉండాల్సింది. అనవసరపు ట్రాక్ లను జోడించి సినిమాను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. బిత్తిరి సత్తిపై యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేయడం ఓవర్ గా అనిపిస్తుంది. నటుడిగా సంతోష్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇద్దరు హీరోయిన్లు తెరపై అందంగా కనిపించారు. మిగిలిన పాత్రలు తమ పరిధుల్లో బాగానే నటించారు. ఫీల్ గుడ్  లవ్ స్టోరీ అవుతుందని ఆశించిన ఈ పేపర్ అంచనాలను అందుకోలేకపోయినా.. ఓ మోస్తరుగా అలరిస్తాడు. 

రేటింగ్: 2.5/5 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios