Asianet News TeluguAsianet News Telugu

రివ్యూ: పంతం

సరికొత్త కథలు, డిఫరెంట్ స్క్రీన్ ప్లే అంటూ టాలీవుడ్ కొత్తపొంతలు తొక్కుందనుకునేలోపు ఇటువంటి సినిమాలు వచ్చి ఆడియన్స్ ను నిరాశ పరుస్తున్నాయి. ఇకనైనా కమర్షియల్, రెగ్యులర్ ఫార్మాట్ కథలను వదిలేసి కొత్త కథలను ఎంపిక చేసుకుంటే హీరోగా గోపీచంద్ విజయాన్ని అందుకోవచ్చు

pantham movie telugu review

నటీనటులు: గోపీచంద్, మెహ్రీన్, సంపత్, తనికెళ్లభరణి, ముఖేష్ రిషి తదితరులు 
సంగీతం: గోపి సుందర్ 
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ళ
నిర్మాత: కె.కె.రాధామోహన్ 
దర్శకత్వం: కె.చక్రవర్తి 

ఒకప్పుడు హిట్ సినిమాలలో నటించిన గోపీచంద్ ఇప్పుడు ఒక్క హిట్టు కూడా లేక డీలా పడ్డాడు. కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లడంతో ఆయన నటిస్తోన్న సినిమాలు ఆడియన్స్ ను మెప్పించలేకపోతున్నాయి. గతేడాది 'ఆక్సిజన్' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినా వర్కవుట్ కాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలనే 'పంతం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈసారైనా గోపీచంద్ అనుకున్న విజయాన్ని సాధించాడా..? లేదా..? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
విక్రాంత్(గోపీచంద్) తన స్నేహితుడితో కలిసి సమాజంలో పెద్ద పేరున్న స్థానాల్లో ఉంటూ అవినీతికి పాల్పడే వారిని ఎంపిక చేసుకుంటూ ప్లాన్ ప్రకారం వారి దగ్గర నుండి డబ్బు కొట్టేస్తుంటాడు. అలా కోట్లలో డబ్బు కొట్టేస్తున్నా.. అది బ్లాక్ మనీ కావడంతో ఎవరూ పోలీసుల వరకు వెళ్లరు. హోం మినిస్టర్ జయేంద్ర అలియాస్ నాయక్(సంపత్) అక్రమంగా సంపాదించిన కొన్ని వందల కోట్ల రూపాయలను కూడా స్కెచ్ వేసి ఎవరికీ అనుమానం రాకుండా దొంగతనం చేస్తాడు విక్రాంత్. డబ్బు ఎవరు దొంగతనం చేస్తున్నారో  తెలుసుకోవడానికి జయేంద్ర స్పెషల్ పోలీస్ ఆఫీసర్(షాయాజీ షిండే)ను నియమిస్తాడు. సడెన్ గా జయేంద్ర ఫోన్ కి 'మనకి కావాల్సింది ఇతడే' అంటూ విక్రాంత్ ఫోటోను వాట్సాప్ చేస్తారు మరో మినిస్టర్. దీంతో అతడిని పట్టుకోవాలని జయేంద్ర మనుషులు బయలుదేరతారు. వారికి విక్రాంత్ చిక్కాడా..? దొంగతనాలు చేసేది విక్రాంత్ అని మినిస్టర్ కు తెలుస్తుందా..? అసలు ఈ విక్రాంత్ ఎవరు..? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ఏ లక్ష్యం మీద అతడు దొంగతనాలు చేస్తున్నాడు..? చివరకు ఏం అయ్యాడు..? అనేది తెరపై చూసి 
తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: 
సమాజంలో జరిగే అన్యాయాలను చూస్తూ చలించిపోయిన ఒక వ్యక్తి సమాజం బాగు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు..? అవినీతిని అంతం చేయడానికి అతడు పట్టిన 'పంతం' ఎలాంటిది అనే అంశాలతో  కథ రాసుకున్న దర్శకుడు ఆ కథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా తెరకేక్కించంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. సాధారణంగా తనకు అన్యాయం జరిగితే హీరో రియాక్ట్ అవుతుంటాడు. కానీ ఈ సినిమాలో కోటీశ్వరుడైన హీరో ప్రజల ఇబ్బందులను చూసి తన తండ్రి ఆస్తిని సహాయం చేయడం ఇష్టం లేక తనే  స్వయంగా అన్యాయం చేసే వారి దగ్గర నుండి డబ్బు కొట్టేస్తూ అది ప్రజలను చేరవేస్తుంటాడు. దర్శకుడు ఈ పాయింట్ కొత్తగా ఉంటుందని స్క్రిప్ట్ రాసుకున్నట్లు గానీ తెరపై మాత్రం హీరోకి సెకండ్ షేడ్ పెద్దగా రుచించదు. కోటీశ్వరుడి పాత్రలో గోపీచంద్ ను కూడా చూడలేం. రొటీన్ కథను అంతే రొటీన్ గా ప్రెజంట్ చేశారు. హీరో దొంగతనాలు చేయడం, ఓ చిన్న లవ్ ట్రాక్, ప్రజల కష్టాలు ఇలా సీన్ టు సీన్ కట్, కాపీ, పేస్ట్ మాదిరి ఒక రకమైన స్క్రీన్ ప్లేతో సినిమా సాగుతుంది.

pantham movie telugu review

ఇంటర్వెల్ బ్యాంగ్ కు హీరో దొరికేస్తాడని అనుకున్న సమయంలో ట్విస్ట్ పెడతారు. ఆ ట్విస్ట్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. హీరో అసలు ఎవరు..? ఎందుకు ఇలా చేస్తున్నాడని నటుడు తనికెళ్లభరణి అతడి క్యారెక్టర్ ను రివీల్ చేసేప్పుడు ఆ సన్నివేశాలు సినిమాకు బలమవ్వాలి. కానీ అవి కాస్త పేలవంగా తయారయ్యాయి. 'విక్రాంత్ సురానా' అంటూ పవర్ ఫుల్ గా మొదలుపెట్టిన హీరోగారి బ్యాక్ గ్రౌండ్ సినిమా చూసే ఆడియన్స్ కు వెటకారంగా అనిపిస్తుంది. ఒక్క క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం రెండున్నర గంటల సినిమాను భరించే సహనం ఉంటే ఈ సినిమాను చూడొచ్చు. పతాక సన్నివేశాల్లో మన సిస్టమ్ ఎలా ఉందని చెబుతూ నాయకులతో పాటు ప్రజలను కూడా ప్రశ్నించే ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఇదొక్కటి తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. లవ్ ట్రాక్ సినిమాకు అనవసరం కానీ గ్లామర్ కోసం, కమర్షియల్ హంగుల కోసం రాసుకున్నారు. ఇక యాక్షన్ సన్నివేశాల విషయానికొస్తే.. మన సినిమాలలో హీరో పది మందిని అవలీలగా కొట్టి పడేస్తుంటాడు. ఈ సినిమాలో కూడా మనం అంతకుమించి ఆశించలేం.

ఇక హిట్ సినిమా కోసం ఎంతగానో పరితపిస్తున్న హీరో గోపీచంద్ ఈ సినిమా కోసం చాలానే కష్టపడ్డాడు. యాక్షన్ సీన్స్, కామెడీ, డైలాగ్స్ ఇలా అన్ని అంశాల్లో మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ అతడి కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం దక్కలేదు. తెరపై గోపీచంద్, మెహ్రీన్ ల జంట చూడడానికి పెద్దగా బాలేదు. మెహ్రీన్ ను అందంగా కూడా చూపించలేకపోయారు. సినిమాలో ఆమె తెరపై కనిపించేది చాలా తక్కువ సన్నివేశాల్లో మాత్రమే.. అప్పుడు కూడా ఆడియన్స్ 'ఓ..' ఈ సినిమాలో హీరోయిన్ ఒకరు ఉన్నారు కదా అనుకుంటారు. ఆమె పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత లేదు. సంపత్ రెగ్యులర్ విలన్ పాత్రలో ఎప్పటిలానే నటించేశారు. ముఖేష్ రిషి, షాయాజీ షిండే తమ పాత్రలతో మెప్పించారు. థర్టీ ఇయర్స్ పృధ్వీ తన కామెడీతో అక్కడక్కడా నవ్విస్తాడు. శ్రీనివాస్ రెడ్డి తన పాత్రలో బాగానే నటించాడు. హంసానందిని గెస్ట్ రోల్ లో మెప్పించింది.

pantham movie telugu review

సాంకేతికంగా కూడా ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోదు. ప్రసాద్ మూరెళ్ళ కెమెరా వర్క్ కథకు తగ్గట్లుగా ఉంది. పాటలు వింటే అసలు గోపి సుందరేనా మ్యూజిక్ చేసింది అని అనుమానం వస్తుంది. మలయాళంలో ఎన్నో అద్భుతమైన బాణీలను అందించిన గోపి సుందర్ తెలుగులో మాత్రం సరైన మ్యూజిక్ చేయడం లేదు. కారణాలు ఏంటో ఆయనకే తెలియాలి. ఎడిటింగ్ వర్క్ పై శ్రద్ధ పెట్టాల్సివుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బాబీ అందించిన రొటీన్ కథ, కథనాలను అంతే రొటీన్ గా డైరెక్ట్ చేసి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించాడు దర్శకుడు చక్రవర్తి.

మరీ రొటీన్‌గా వుండడం వలన, చెప్పదలచుకున్న పాయింట్‌ని సరిగ్గా తెరకెక్కించలేక పోవడం వలన, స్క్రీన్‌ప్లేలో జరిగిన లోపాల వలన... ఇలా ఏదో ఒక కారణంతో సినిమాలు ఫ్లాప్‌ అవుతుంటాయి. ఈ సినిమా మాత్రం రైటింగ్‌ టేబుల్‌ నుంచి ఎడిటింగ్‌ టేబుల్‌ వరకు అన్ని చోట్లా శ్రమలేమి కారణంగానే బోల్తా కొట్టింది. సరికొత్త కథలు, డిఫరెంట్ స్క్రీన్ ప్లే అంటూ టాలీవుడ్ కొత్తపొంతలు తొక్కుందనుకునేలోపు ఇటువంటి సినిమాలు వచ్చి ఆడియన్స్ ను నిరాశ పరుస్తున్నాయి. ఇకనైనా కమర్షియల్, రెగ్యులర్ ఫార్మాట్ కథలను వదిలేసి కొత్త కథలను ఎంపిక చేసుకుంటే హీరోగా గోపీచంద్ విజయాన్ని అందుకోవచ్చు!

రేటింగ్: 2/5    

Follow Us:
Download App:
  • android
  • ios