Asianet News TeluguAsianet News Telugu

పద్మావతికి సీబీఎఫ్సీ క్లియరెన్స్.. కండిషన్స్ అప్లై..

  • పద్మావతి సినిమాకు లైన్ క్లియర్ చేసిన సెన్సార్ బోర్డు
  • సర్టిఫికెట్ ఇస్తాం కానీ కండిషన్స్ అప్లై అన్న సెన్సార్ బోర్డు
  • టైటిల్ మార్చి, 26 సీన్స్ కట్ చేస్తే రిలీజ్ కు పర్మిషన్
  • కానీ మరోదఫా చర్చలకు రెడీ అవుతున్న భన్సాలీ
padmavathy gets clearance from censor board but conditions apply

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన 'పద్మావతి' సినిమా ఎంత వివాదాస్పదమైందో మీకు తెలిసిందే. రాజ్ పుత్ కర్ణి సేన ఈ చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో గత నెల రోజుక క్రితమే విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పటికీ రిలీజ్ కు నోచుకోని సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ సినిమాను రిలీజ్ చేయలేమంటూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

 

మరోవైపు.. 'పద్మావతి' కాల్పనిక పాత్ర అని మేకర్స్ చెప్తున్నా... మా హిందూ రాణి పద్మావతి పైనే ఈ మూవీ అని రాజ్‌పుత్ కర్ణీ సేన వాదించుకుంటూ వస్తున్నారు. ఇన్ని వివాదాల నడుమ ఇవాళ సమావేశమైన స్పెషన్ ప్యానెల్ బోర్డు ఎట్టకేలకు ఈ సినిమాకు క్లియరెన్స్ ఇచ్చింది. గురువారం జరిగిన ప్రత్యేక ప్యానెల్‌ సమీక్షా సమావేశం తర్వాత సెన్సార్ బోర్డు తమ నిర్ణయాన్ని వెల్లడించింది. తమ ప్రతిపాదనలకు ఒప్పుకుంటే యు/ఏ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పింది.

 

చిత్ర టైటిల్‌ను పద్మావత్‌ గా... మార్చడంతో పాటు.. 26 సీన్లను తొలగించడానికి ఒప్పుకుంటే సర్టిఫికెట్ ఇష్యూ చేయడానికి తాము సిద్దమని ప్రకటించింది. అంతేకాదు, సినిమా ప్రారంభానికి ముందు జారీ చేసే ప్రకటనల విషయంలోనూ ప్యానెల్‌ షరతులు విధించిందని తెలుస్తోంది. మరోవైపు సెన్సార్ నిర్ణయానికి 'పద్మావతి' చిత్ర యూనిట్ సూచన ప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే మరో దఫా సమావేశం తర్వాతనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

 

పద్మావతి వివాదానికి మూల కారణం ఈ సినిమా కథ. రాజ్‌పుత్ కర్ణీ సేన చిత్ర యూనిట్ పై దాడికి దిగింది. సంజయ్‌ లీలా భన్సాలీకి షూటింగ్ స్పాట్ లోనే గాయాలు కావటంతో వివాదం మరింత ముదిరింది. అసలు పద్మావతి అనే పాత్రపై రకరకాల ప్రచారాలున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అవధ్‌ ప్రాంతానికి చెందిన సూఫీ సంత్‌ మాలిక్‌ మహ్మద్‌ జాయసీ 540లో 'పద్మావత్‌' పేరుతో కథ రాశారు. ఇందులో సింహళ దేశ రాజకుమారిగా పద్మావతి ప్రస్తావన ఉంది. అత్యంత అందమైన రాణిగా చెప్పబడే ఈమెను..రాజస్తాన్‌లోని చితోడ్‌గఢ్‌ రాజు రతన్‌సేన్ పెళ్లాడతాడు. సింహళ రాజ్యంపై దండెత్తి.. ఆ రాజ్యాన్ని ఓడించిన తర్వాత ఆమెను తీసుకుని చితోడ్ గడ్ వస్తాడు.

 

ఢిల్లీ సుల్తాన్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీ ఆ సమయంలోనే రాజ్య విస్తరణ కాంక్షతో రగిలిపోతుంటాడు. అలాంటి తరుణంలో చితోడ్ గడ్ రాజ్యం నుంచి బహిష్కరించబడ్డ ఓ బ్రాహ్మణుడు ఖిల్జీతో చేతులు కలుపుతాడు. పద్మావతి అందం గురించి చెప్పి ఖిల్జీని రెచ్చగొడుతాడు. అలా ఖిల్జీ చితోడ్‌గడ్‌పై దండెత్తి రతన్‌సేన్ రాజ్యాన్ని ఓడిస్తాడు. ఆ పోరులో రతన్ సేన్ మరణిస్తాడు.

 

తదనంతరం పద్మావతిని సొంతం చేసుకునేందుకు.. ఖిల్జీ కోటలోకి ప్రవేశించగా.. అప్పటికే ఆత్మార్పణం చేసుకున్న పద్మావతి చితి కనిపిస్తుంది. అయితే జాయసీ కథ నిజమా? కాదా? అన్న విషయంలో అనేక వాదనలున్నాయి. చాలామంది చరిత్రకారులు, ప్రొఫెసర్లు దీన్ని కొట్టిపడేస్తున్నారు. చరిత్ర ప్రకారం ఖిల్జీ చితోడ్‌గఢ్‌పై దండెత్తి రతన్‌ సేన్‌ను 1303లో ఓడించాడు. 1316లో చనిపోయాడు. కానీ ఆ కాలంలో పద్మావతి పేరుతో రాణి ఎవరూ లేరన్నది వారి వాదన. కానీ రాజ్‌పుత్‌లు మాత్రం పద్మావతి అనే పాత్ర నిజమని నమ్ముతున్నారు. దీంతో వివాదం ముదిరింది.

Follow Us:
Download App:
  • android
  • ios