Asianet News TeluguAsianet News Telugu

"పద్మావత్" మూవీ ఫుల్ స్టోరీ రివ్యూ రేటింగ్

  • చిత్రం-పద్మావతి
  • తారాగణం-రన్వీర్ సింగ్, షాహిద్ కపూర్, దీపికా పదుకునె, అదితి రావ్, జిమ్ సరబ్
  • సంగీతం, దర్శకత్వం,నిర్మాత- సంజయ్ లీలా భన్సాలీ
  • ఆసియానెట్ రేటింగ్- 4.25/5
padmavathi movie review

కథ-

గెలుపు కోసం యుద్ధ నియమాల్ని పాటించకుండా గెలుపే అంతిమ లక్ష్యంగా వెన్నుపోటుకు సైతం వెనుకాడని తత్వం వున్న రాజు అల్లావుద్దీన్ ఖిల్జీ(రన్వీర్ సింగ్). తనకు నచ్చిందేదైనా దక్కించుకుని తీరాలనుకునే నైజం అతనిది. అఖండ హిందూ దేశానికి మహరాజుగా ఏలుతున్న జలాలుద్దీన్ ఖిల్జీని చంపి తనకు నచ్చిన ఆ మహరాజు స్థానాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ ఆక్రమిస్తాడు. జలాలుద్దీన్ కూతురు మాలికా ఎ జనత్(అదితి రావ్) ను ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుంటాడు. మాలిక అల్లావుద్దీన్ ను ప్రేమించినా.. తన తండ్రిని చంపాక అసహ్యించుకుంటుంది. కానీ తప్పక పెళ్లిచేసుకుని అల్లావుద్దీన్ బేగమ్ గా మారుతుంది.

 

మరోవైపు చిత్తోడ్ గడ్ మహారాజు రాజా రతన్ సింగ్(షాహిద్ కపూర్) కలింగ దేశంలో అతిథిగా వెళ్లి అక్కడ యువరాణి పద్మావతి(దీపికా పదుకునె)తో ప్రేమలో పడిపోతాడు. ఇద్దరూ వివాహం చేసుకుంటారు. రాజధానికి తీసుకొస్తాడు. అనంతరం రాజ మందిరంలో మహారాజా రతన్, పద్మావతిలు ఏకాంతంగా గడుపుతున్న సమయంలో అక్కడ బ్రహ్మచారియైన రాజగురువు రాఘవ చతురుడు వాళ్లిద్దరి రాసలీలలను చూస్తుంటాడు. అది గమనించిన పద్మావతి రతన్ ను హెచ్చరిస్తుంది. దాంతో రతన్ గురిచూసి కత్తి విసురుతాడు. ఆ కత్తికంటిన రక్తం వాసన రాజగురువు మాత్రమే వేసుకునే సుగంధపు వాసన వస్తుంది. దాంతో రాజగురువును ద్రోహిగా నిరూపించి రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తాడు రాజా రతన్ సింగ్.

 

ఆ కోపంతో రాజ్యం విడిచి వెళ్లిన అల్లావుద్దిన్ పంచన చేరిన రాజద్రోహి రాఘవ చతురుడు చిత్తోడ్ గడ్ రాణి అందమైన పద్మావతి నీ పక్కనుంటేనే నీవు కోరుకున్నదల్లా నీకు దక్కుతుంది. లేకుంటే ఏమీ దక్కదు అని రెచ్చగొడతాడు. దాంతో రాణి పద్మావతిపై మనసు పడతాడు అల్లావుద్దీన్. రాఘవ చతురుడు రెచ్చగొట్టడంతో చిత్తోడ్ గఢ్ పై దండయాత్రకు వెళతాడు అల్లావుద్దీన్. అయితే నెలలు గడుస్తున్నా చిత్తోడ్ గఢ్ ను జయించలేకపోతాడు అల్లావుద్దీన్. ఇక ఇలాగే వుంటే తన కోరిక,పంతం నెరవేరదనే ఆలోచనతో ఎలాగైనా పద్మావతిని చూడాలనే తలంపుతో రతన్ సింగ్ తో స్నేహ హస్తం చాచి కుతంత్రానికి పాల్పడతాడు. అలా చిత్తోడ్ గడ్ లో అతిధిగా వచ్చి రాణి పద్మావతిని చూడాలనుకుంటాడు. అయితే నిబంధనలు ఉల్లంఘించకూడదనే ఉద్దేశంతో అతిథిగా నిరాయుధుడిగా వచ్చిన అల్లావుద్దీన్ తనను అవమానపరిచినా రతన్ సింగ్ చంపకుండా వదిలేస్తాడు.

 

అయితే అల్లావుద్దీన్ తన ఆతిథ్యం కూడా  స్వీకరించాలని కోరతాడు. సరేనని వెళ్లిన రాజా రతన్ సింగ్ ను రాజధర్మానికి విరుధ్దంగా బంధించి దిల్లీకి తీసుకెళ్లి కారాగాలంలో బంధిస్తాడు. అతన్ని వదిలిపెట్టాలంటే పద్మావతి రావాలని షరతు విధిస్తాడు. దాంతో తప్పక పద్మావతి అల్లావుద్దీన్ కోటకు వెళ్తుంది. అయితే తన తండ్రిని చంపిన పగతో రగిలిపోతున్న జలాలుద్దీన్ కుమారుడు అల్లావుద్దీన్ పై హత్యా యత్నం చేస్తాడు. అలా గాయపడటంతో పద్మావతికి స్వాగతం పలికేందుకు నేను వెళ్తాననటంతో తన బేగమ్ ను పంపిస్తాడు. గఫూర్ ను కాదని పద్మావతికి స్వాగతం పలికిన అల్లావుద్దీన్ భార్య మాలిక్(అదితి రావ్) పద్మావతి,రతన్ లు తప్పించుకునేందుకు సహకరిస్తుంది. అలా తప్పించుకుని వెళ్లిన వాళ్లను పట్టుకోవటంలో అల్లావుద్దీన్ విఫలమవుతాడు. దాంతో రెట్టింపు సైన్యంతో అల్లావుద్దీన్ చిత్తోడ్ గఢ్ పై దండయాత్రకు బయల్దేరతాడు. ఆ తర్వాత రాజా రతన్ సింగ్, పద్మావతిలు అల్లావుద్దీన్ ను ఎలా ఎదుర్కొన్నారు. చివరకు అల్లావుద్దీన్ ను ఎలా ఓడించారు. అల్లావుద్దీన్ ఖిల్జీని ఓడించటానికి రాజ్ పుత్ రాణి పద్మావతి పన్నిన వ్యూహం ఏంటి. చేసిన త్యాగం ఏంటి అన్నది తెలుసుకోవాలంటే థియేటర్ కు వెళ్లాల్సిందే.

 

విశ్లేషణ-

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పద్మావత్ గతంలో 3డీ టెక్నాలజీపై వచ్చిన విమర్శలన్నింటిని పటాపంచెలు చేసిందనే చెప్పాలి. చారిత్రక కథను ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ చూస్తున్నప్పుడు రాజమౌళి బాహుబలి గుర్తుకురాక మానదు. ఒక చారిత్రక కథను తెరకెక్కించాలంటే దానికి వుండాల్సిన గట్స్ వేరు. పద్మావతి ఎంత వివాదాస్పదమైందో, ఎంతగా వార్తల్లో నిలిచిందో సినిమా ప్రారంభమైనప్పటి నుంచీ చూస్తునే వున్నాం. ఈసినిమాను ఖచ్చితంగా చూసి దాన్ని అణువణువూ పరిశీలించాలని ప్రతి ఒక్కరికీ కోరిక కలిగేంతలా పద్మావతి వార్తల్లో నిలిచింది.

 

సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రంలో అన్ని అంశాలను సమపాళ్లలో మేళవించి రంగరించి ఒక అద్బుత చిత్రంగా మలిచారనటంలో సందేహం లేదు. ప్రేమ, డ్రామా, పగ, పంతం, త్యాగం, యుద్ధ సన్నివేశాలు ఇలా చారిత్రక సినిమా అంటే ఇలా వుండాలిరా అన్నంతగా సినిమా కనిపించింది. స్క్రీన్ పై ప్రతీ సీన్ లో భన్సాలీ ప్రతిభా పాటవాలు కనిపిస్తాయి. ఎన్నో అద్భుతమైన చితత్రాలు తెరకెక్కించిన భన్సాలీ పద్మావతి విషయంలో మరో అడుగు ముందేసి పర్ ఫెక్షనిస్ట్ అనిపించుకున్నారు.

 

ఇక సినిమాలో రన్వీర్ సింగ్ నటన అద్భుతంగా అనిపిస్తుంది. అల్లావుద్దీని ఖిల్జీ అంటే ఇలానే వుంటాడనిపించేలా తను పాత్రలో జీవించాడనటంలో సందేహం లేదు. ఫస్టాఫ్ ఆకట్టుకుంది. పద్మావతి ఖిల్జీ కోటకు వెళ్లేందుకు సిద్ధపడుతూ ఇంటర్వెల్ బ్యాంగ్ పర్ ఫెక్ట్ గా నిలిచింది. భారీ సెటింగ్స్ తో లొకేషన్స్ టేకింగ్ బాగుంది. సంగీతం కూడా పాటలతోపాటు నేపథ్య సంగీతం భన్సాలీ స్టాండర్డ్స్ కు తగ్గట్టుగా వుంది. కెమెరా టేకింగ్ కూడా అద్భుతంగా వుంది. ముఖ్యంగా చిత్తోడ్ గఢ్ కోటను బంధించిన తీరు, వల్గారిటీ లేకుండా దీపికాను పద్మావతిగా అందంగా చూపించిన తీరు కెమెరామెన్ పనితీరుకు నిదర్శనం.

 

అయితే ఒక చారిత్రక ఘట్టాన్ని లేదా చారిత్రక వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు కథను క్లైమాక్స్ దాకా ఆ టెంపోతో కొనసాగించాల్సి వుంటుంది. పద్మావతి చిత్రం ప్రారంభం నుంచి ఎక్కడా బోర్ కొట్టకున్నా ఉవ్వెత్తున ఎగసిన కెరటం ఎలా పడిపోతుందో క్లైమాక్స్ సీన్ అలా పడిపోయినట్లుగా అనిపిస్తుంది. అంతటి పద్మావతి రెండో రాణిగా ఎలా వస్తుందన్నది ఈ కాలానికి కనెక్ట్ కాని అంశం(అది చరిత్ర కాకుంటే). ఇది చరిత్ర కాదు అని చెప్పదలుచుకున్నప్పుడు కథలో ఫిక్షన్ మరింత పర్ ఫెక్ట్ గా జోడించాల్సిన అవసరం వుంటుంది. సరే చరిత్రే అనుకుంటే... క్లైమాక్స్ లో రాణి త్యాగాన్ని చూపాడే గానీ దర్శకుడు రాణి ధైర్య సాహసాల్ని ప్రదర్శించేందుకు ఎక్కడా అవకాశం ఇవ్వకపోవడం పెద్దమైనస్. అలా చూసినప్పుడు అల్లావుద్దీన్ ఓడిపోయాడా అనిపిస్తుంది. అల్లావుద్దీన్ ను, పద్మావతిని ఇద్దరినీ గెలిపించటానికి, విమర్శలు తలెత్తకుండా వుండేందుకు ఇలా క్లైమాక్స్ డిజైన్ చేశాడనిపిస్తుంది. బాహుబలితో పోల్చి చూస్తే బాహుబలి దీనికంటే మెరుగైన సినిమాగా అనిపిస్తుంది. అయితే దీని ప్రాధాన్యత దీనికే.

చివరగా-

పద్మావత్ డబ్బింగ్ సినిమా కావటంతో భాషపరంగా కొంత కనెక్టివిటీ మిస్ అవుతుంది గానీ ఇతరత్రా ఒకసారి చూడాల్సిన సినిమానే.

Follow Us:
Download App:
  • android
  • ios