Asianet News TeluguAsianet News Telugu

పడటమే కానీ... (‘పడి పడి లేచె మనసు’ రివ్యూ)

ప్రేమ కథా చిత్రాలు ఎప్పుడూ ఎవర్ గ్రీనే. అయితే వాటిని అంతే చక్కగా ప్రెజెంట్ చేయగలిగితే అవి బ్రతికి బట్టగడతాయి..లేకుంటే చూసేవారికి సహనపరీక్ష పెట్టేస్తాయి. ముఖ్యంగా ప్రెష్ ధాట్స్..అందమైన ఫీలింగ్స్ ..చక్కటి విజువల్స్...ముచ్చటైన మ్యూజిక్ తోడైతే సింపుల్ ప్రేమ కథ అయినా సిల్వర్ జూబ్లి ఆడేస్తుంది.

padi padi leche manasu movie review
Author
Hyderabad, First Published Dec 21, 2018, 5:58 PM IST

--సూర్య ప్రకాష్ జోశ్యుల

ప్రేమ కథా చిత్రాలు ఎప్పుడూ ఎవర్ గ్రీనే. అయితే వాటిని అంతే చక్కగా ప్రెజెంట్ చేయగలిగితే అవి బ్రతికి బట్టగడతాయి..లేకుంటే చూసేవారికి సహనపరీక్ష పెట్టేస్తాయి. ముఖ్యంగా ప్రెష్ ధాట్స్..అందమైన ఫీలింగ్స్ ..చక్కటి విజువల్స్...ముచ్చటైన మ్యూజిక్ తోడైతే సింపుల్ ప్రేమ కథ అయినా సిల్వర్ జూబ్లి ఆడేస్తుంది. అందుకే దర్శకులు, హీరోలు ప్రేమ కథలంటే పిచ్చ లైకింగ్ చూపెడుతూంటారు. ఈ రోజు రిలీజైన ‘పడి పడి లేచె మనసు’కూడా ఓ ప్రేమ కథా చిత్రమే. మరి ఈ ప్రేమ కథకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారా...హృదయానికి హత్తుకుంటారా...రివ్యూలో చూద్దాం.

కథేంటి

ప్లాష్ బ్యాక్ నేరేషన్ లో మొదలయ్యే ఈ కథలో ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌  సూర్య (శ‌ర్వానంద్‌)  మెడికో  వైశాలి (సాయిప‌ల్ల‌వి) ని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేస్తాడు. కొద్ది కాలానికి  వైశాలి కూడా అత‌న్ని ప్రేమిస్తుంది.  ఇలా ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతూ నేపాల్ వెళ్తారు. నేపాల్ ఎందుకూ అంటే వైశాలి కు అక్కడో మెడికల్ క్యాంప్. అక్కడ వైశాలి ..మనం పెళ్లి చేసుకుందాం అని ప్రపోజల్ పెడుతుంది. అప్పుడు విశాల్...ఓ చిత్రమైన ఫిలాసఫి చెప్తాడు..పెళ్ళి  చేసుకుంటే ప్రేమ మాయమైపోతుంది..ఎంతకాలం కలిసి ఉంటామో తెలియదు.., కేవలం ప్రేమలో మాత్రమే హ్యాపీగా ఉండగలం అంటాడు. మరీ మనం కలిసుండకపోతే చచ్చిపోతాం అనుకున్న రోజునే పెళ్లి చేసుకుందాం అంటాడు. అంతేకాదు అందుకు రెండేళ్లు టైమ్ తీసుకుని విడిగా ఉందాం. 

అప్పటికి మన మధ్య ప్రేమే బ్రతికుండి..విడిగా ఉండలేం అనిపిస్తే పెళ్లి చేసుకుందాం అంటాడు. వైశాలికు ఈ ప్రపోజల్ ఇష్టం లేకపోయినా ఓకే అంటుంది. అలా రెండేళ్ల తర్వాత ఇద్దరూ కలుస్తారు. ఈ గ్యాప్ లో చాలా జరుగుతాయి. ఆ చాలా లు వీళ్లద్దరి మధ్యా ప్రేమకు పరీక్ష పెడతాయా..ఇద్దరూ మళ్లీ కలుస్తారా..లేదా, అసలు ఇలాంటి ప్రపోజల్ పెట్టాలనే ఆలోచన సూర్యకు ఎందుకు కలిగింది వంటి విషయాలు   తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

ఆ సినిమా గుర్తు వస్తుంది

ఇక ఈ సినిమాలో మెయిన్ ప్లాన్ ..విడిపోదాం..అప్పటికీ మన ప్రేమ బ్రతికుంటే పెళ్లి చేసుకుందాం అనే ఐడియా..అప్పుడెప్పుడో దశాబ్దాలక్రితం వచ్చి సూపర్ హిట్ అయ్యిన బాలచందర్ మరో చరిత్రను గుర్తు చేస్తుంది. ఆ పాయింట్ అప్పటికి ఇన్నోవేటివ్. ఈ కాలానికి అసలు వింటానికే విచిత్రంగా ఉండే ఆలోచన. ఈ రోజుల్లో యూత్ ఇలా అసలు ఇలా ఆలోచిస్తారా...ఇది ఎప్పటికథ అనిపిస్తుంది. అలాగే హీరో,హీరోయిన్స్ ఇద్దరూ మెచ్యూరిటిగా అనిపిస్తారు చూడటానికి..కానీ ఆలోచనలు వారి మధ్య సన్నివేశాలు మాత్రం పద్దెనిమిది ఏళ్ల పిల్లల మధ్య జరిగే రొమాన్స్ లా అనిపిస్తూంటుంది.

 

ఏం బాగోలేదా

ఈ సినిమాలో ఫస్టాఫ్ బాగుంది. విజువల్స్ బాగున్నాయి. పాటలు బాగున్నాయి. ఇలా బోలెడు బాగున్నాయిలు ఉన్నాయి. అయితే అదే సమయంలో ....వీటిన్నటినీ కలిపే కథే భాగోలేదు. ముఖ్యంగా సెకండాఫ్ లో సీన్స్ ..ఇంక ఎప్పటికి పూర్తి కావా అన్నట్లు విసిగిస్తూంటాయి. దానికి తోడు సినిమాలో 50 ఫస్ట్ డేట్స్ ట్విస్ట్ ఒకటి. ఎమ్నీషియా గర్ల్  అనే సినిమా నుంచి లేపినట్లుగా ఉన్న సీన్స్ సినిమాకు అతకలేదు. అసలు ఈ కథలో మెయిన్ ప్లాట్ ఐడియాలిజీకు ..మతిమరుపు కాన్సెప్టు ని కలపాలని ఎలా వచ్చిందో అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా డైరక్టర్ హడావిడిగా ముగించేసారా..లేక చాలా తెలివైన వారికి మాత్రమే  అర్దం అయ్యేలా ముగించారా అనే డౌట్ వస్తుంది. 

 

ఎవరెలా..

సాయి పల్లవి,శర్వానంద్ తమ పాత్రలకు తగినట్లు ఎక్సప్రెషన్స్ తో ఎక్సపెక్టేషన్స్ రీచ్ అయ్యారు.  ప్రియదర్శ,వెన్నెల కిషోర్, సునీల్ తో కూడిన కామెడీ ..నవ్వించే ప్రయత్నం చేసింది. 

 

టెక్నికల్ గా ...

మేకింగ్ పరంగా  దర్శకుడు హను రాఘవపూడి ఎప్పుడూ విజేతే. ఆ విషయంలో తిరుగులేదు. అయితే ఆయన ఎంచుకునే కథాంశాలే ఆ మేకింగ్ టాలెంట్ ని అన్యాయం చేసేస్తున్నాయి. ఎప్పకైనా మేకింగ్ మించే కథతో వస్తే అక్కడ నుంచి ఆయన కెరీర్ మరో మెట్టు ఎక్కుతుంది.  ఇక విశాల్ చంద్రశేఖర్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది.   బ్యాక్ గ్రౌండ్ స్కోర్  అదరకొట్టాడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ జస్ట్ ఓకే.  సినిమాలో  హైలెట్ ఏదైనా ఉందీ అంటే జయకృష్ణ సినిమాటోగ్రఫీ . కోలకతా లోని లొకేషన్స్ చాలా బాగా చూపెట్టాడు. ఎంత ఖర్చుపెట్టారో కానీ..నిర్మాణ విలువలు  మాత్రం బాగా రిచ్ గా వున్నాయి.

 

ఫైనల్ ధాట్..

మతిమరుపు చుట్టూ తిరిగే ఈ కథ ఎంత త్వరగా మర్చిపోగలిగే అంత మనస్సుకు మేలు

 

ఎవరెవరు..

న‌టీన‌టులు: శ‌ర్వానంద్, సాయిపల్లవి, ముర‌ళీ శ‌ర్మ‌, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియ‌ద‌ర్శి, ప్రియారామ‌న్ త‌దిత‌రులు 

స‌ంగీతం: విశాల్ చంద్ర‌శేఖ‌ర్ 

ఛాయాగ్ర‌హ‌ణం: జ‌య‌కృష్ణ గుమ్మ‌డి 

కూర్పు: ఎ.శ్రీక‌ర్‌ప్ర‌సాద్‌ 

సాహిత్యం: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, కృష్ణ‌కాంత్ 

నిర్మాత‌: సుధాక‌ర్ చెరుకూరి 

ద‌ర్శ‌కుడు: హ‌ను రాఘ‌వ‌పూడి 

సంస్థ‌: శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్

విడుద‌ల‌: 21 డిసెంబ‌రు 2018

Follow Us:
Download App:
  • android
  • ios