బిగ్ బాస్ 3 వ్యవహారం రోజు రోజుకు ముదురుతున్నా నాగార్జున మాత్రం నోరు మెదపడం లేదు. మరో వైపు స్టార్ మా సంస్థ కూడా జులై 21న బిగ్ బాస్ 3 ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఆ రోజు సాయంత్రం 9 గంటలకు తొలి ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ రియాలిటీ షోని చుట్టుముడుతున్న వివాదాలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. 

బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో చాలా చీకటి కోణాలు ఉన్నాయని శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్త సంచలన కామెంట్స్ చేశారు. కో ఆర్డినేటర్లు అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలనే డిమాండ్ ఎక్కువైంది. బిగ్ బాస్ షోకు వ్యతిరేకంగా పోరాడే వారిలో నిర్మాత కేతిరెడ్డి కూడా జాయిన్ అయ్యారు. ఢిల్లీకి వెళ్లి మరీ నిరసనలు తెలియజేసారు. 

మన సాంప్రదాయాలకు విరుద్ధమైన బిగ్ బాస్ షోని ప్రసారం చేయడానికి వీల్లేదని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉస్మానియా విద్యార్థులు కూడా బిగ్ బాస్ కు వ్యతిరేకంగా పోరాడుతుండడం సంచలనంగా మారింది. ఇప్పటికే మీడియా సమావేశం నిర్వహించి షోని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

ఆదివారం నుంచి ఈ షో ప్రసారం కానుండడంతో నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోను ముట్టడించడానికి విద్యార్థులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కందుల మధు ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థులు అన్నపూర్ణ స్టూడియోను ముట్టడించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే నాగార్జున నివాసం వద్ద భద్రత పెంచారు. నాగార్జున మూడవ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నెలకున్న వివాదం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం భద్రత కల్పించింది.