రాజమౌళి ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. ఆస్కార్‌ విన్నర్‌ కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా కన్నుమూశారు. దీంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

ఆస్కార్‌ విన్నర్‌, సంచలన మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తండ్రి, రైటర్‌, దర్శకుడు శివశక్తి దత్తా(92) కన్నుమూశారు. హైదరాబాద్‌ మణికొండలోని తన నివాసరంలో సోమవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. 

వయసు భారంతో కూడిన అనారోగ్యంతో ఆయన మరణించినట్టు సమాచారం. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కొవ్వూరులో జన్మించిన రాజమౌళి పెదనాన్న శివశక్తి దత్తా 

దర్శక ధీరుడు రాజమౌళికి శివశక్తి దత్తా పెదనాన్న అవుతారు. విజయేంద్రప్రసాద్‌, శివశక్తి దత్త అన్నదమ్ములు. శివశక్తి దత్తా లిరిక్‌ రైటర్‌గా, స్క్రీన్‌ రైటర్ గా, చిత్రకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

శివశక్తి దత్తా 1932 అక్టోబర్‌ 8న రాజమండ్రి సమీపంలోని కొవ్వూరులో జన్మించారు. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. సినిమాల్లోకి వచ్చాక ఆ పేరు మారినట్టు సమాచారం.

ఆర్ట్స్ పై ఆసక్తితో ముంబాయికి శివశక్తి దత్తా 

శివశక్తి దత్తా అప్పట్లోనే ఇంటర్‌ వరకు చదువుకున్నారు. నాటకాలు, కళలపై ఆసక్తితో ముంబయికి వెళ్లిపోయి సర్ జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజీ చేరారు. రెండేళ్ల తర్వాత మళ్లీ కొవ్వూరు తిరిగొచ్చి చిత్రకారుడిగా పని చేశారు. 

'కమలేశ్' అనే కలం పేరుతో ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మ్యూజిక్‌పై ఇష్టంతో సితార, గిటార్, హార్మోనియం నేర్చుకున్నారు.

మ్యూజిక్‌పై ఆసక్తితో చెన్నైకి శివశక్తి దత్తా 

మ్యూజిక్‌పై ఇంట్రెస్ట్ తో మద్రాస్ వెళ్లిపోయి సోదరుడు విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 1988లో వచ్చిన 'జానకి రాముడు' సినిమాకు స్క్రీన్ రైటర్‌గా పని చేశారు శివ శక్తి దత్తా. ఈ మూవీతో ఇద్దరికీ మంచి పేరొచ్చింది.

 ఆ తర్వాత వరుసగా సినిమాలకు పాటలు రాస్తూ వచ్చారు. `బాహుబలి 1` సినిమాలో ``మమతల తల్లి``, ``ధీవర``, ``బాహుబలి 2``, `సాహోరే బాహుబలి``, `ఎన్టీఆర్: కథానాయకుడు` ``కథానాయక``, 'సై' సినిమాలో ``నల్లా నల్లాని కళ్ల పిల్ల``, `హనుమాన్` సినిమాలో ``అంజనాద్రి థీమ్ సాంగ్``, `రాజన్న`మూవీలో ``అమ్మా అవని``, `ఛత్రపతి` సినిమాలో ``మన్నేల తింటివిరా`` పాటలు రాశారు.  `అర్థాంగి` చిత్రానికి దర్శకత్వం వహించారు. 

శివశక్తి దత్తా మృతి పట్ల పవన్‌ సంతాపం

శివశక్తి దత్తాకు ముగ్గురు సంతానం. కీరవాణి, కాంచి, కల్యాణి మాలిక్. ఆయనకు ఒక అన్న, ఓ అక్క, నలుగురు తమ్ముళ్లు ఉన్నారు. తమ్ముడు విజయేంద్ర ప్రసాద్. శివశక్తి దత్తా మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సంగీత దర్శకులు కీరవాణి తండ్రి, రచయిత, చిత్రకారులు శివశక్తి దత్తా కన్ను మూశారని తెలిసి చింతించాను. దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. 

కళలు, సాహిత్యంపై ఎంతో అభిమానం కలిగినవారాయన. తెలుగు, సంస్కృత సాహిత్యాలపై పట్టున్న దత్తా గారు పలు చలనచిత్రాలకు గీత రచన చేశారు. పితృ వియోగంతో బాధపడుతున్న కీరవాణికి, ఆయన సోదరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను` అని తెలిపారు.