ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్లాండో బ్లూమ్ వార్తల్లో నిలిచాడు. అతడి చేస్తున్న ఓ పని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. మరణించిన కుక్క అస్థిపంజరాన్ని తన ఇంటి ముందే ఉంచుకుని ప్రతి రోజు దానికి గుడ్ నైట్ చెబుతున్నాడు. అతడికేమైనా పిచ్చా అని అనిపించొచ్చు.. కానీ ఆర్లాండో అలా చేయడానికి బలమైన కారణం ఉంది. 2004లో ఓ చిత్ర షూటింగ్ జరుగుతుండగా ఓ వీధి కుక్క ఆర్లాండోని ప్రమాదం నుంచి కాపాడింది. 

సాలుకి మిక్స్ జాతికి చెందిన ఓ కుక్క వల్ల ఆర్లాండో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి ఆర్లాండో ఆ కుక్కని పెంచుకుంటున్నాడు. దానికి సిధి అని పేరు కూడా పెట్టాడు. 2015లో సిధి ఆరోగ్యం బాగాలేక మరణించింది. సిధి మరణం ఆర్లాండోని తీవ్రంగా కలచివేసింది. తన సిధి మరచిపోలేక దాని ఆస్థి పంజరాన్ని ఇంటిముందే ఉంచుకున్నాడు. 

ప్రతి రోజు కుక్క ఆస్థి పంజరానికి గుడ్ నైట్ చెబుతాడట. చనిపోయినప్పటికీ నా సిధి నాతోనే ఉండాలనే ఉద్దేశంతో దాని ఎముకల గూడుని ఇంటిముందు ఏర్పాటు చేసుకున్నా. కొంత మందికి ఇది వింతగా అనిపించొచ్చు. కానీ నాకు మాత్రం సంతోషాన్నిస్తోంది అని ఆర్లాండో తెలిపాడు. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ చిత్రంతో ఆర్లాండో ప్రేక్షకులందరికీ చేరువయ్యాడు.