వరుస విజయాలతో కొరటాల శివ టాలీవుడ్ లో అగ్ర దర్శకుడుగా మారిపోయారు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలుగా నిలిచాయి. కొరటాల ప్రతిభ పసిగట్టిన మెగాస్టార్ చిరంజీవి అతడితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. భరత్ అనే నేను చిత్రం గత ఏడాది ఏప్రిల్ లో విడుదలయింది. అంటే కొరటాల శివ చిత్రం విడుదలై ఏడాదికి పైగా గడిచిపోతోంది. కానీ ఇంతవరకు అతడి నుంచి కొత్త సినిమా రాలేదు. 

చిరంజీవితో సినిమా ఖరారైన ఇంతవరకు ప్రారంభోత్సవం కూడా నోచుకోలేదు. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్ లోనే కొరటాల శివ, చిరంజీవి చిత్రం ప్రారంభం కావాల్సింది. రాంచరణ్ ఆమేరకు కొరటాలని ఒప్పించాడట. డిసెంబర్ నాటికి సైరా మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది. అప్పుడే సినిమాని ప్రారంభిద్దాం అని కొరటాలతో రాంచరణ్ చెప్పాడట. ముందుగా సైరా చిత్రాన్ని 2019 సమ్మర్ లో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. 

కానీ సైరా చిత్రం షూటింగ్ ఆలస్యమవుతుండడంతో కొరటాల శివకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ పరిస్థితి ముందే గమనించి ఉంటే కొరటాల ఈ లోగా వేరే హీరోతో ఓ సినిమా పూర్తి చేసి ఉండొచ్చు. మెగాస్టార్ తో సినిమా కాబట్టి కొరటాల శివ ఒప్పిగ్గా ఎదురుచూస్తున్నాడు. ఆగష్టులో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి.