బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ 3 ప్రసారాలు రద్దు చేయడం కోసం వరుసగా ఉద్యమాలు మొదలవుతున్నాయి. నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే ఢిల్లీలో ఓ నిరసన కార్యక్రమం జరిగింది. కేతిరెడ్డి మరో ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు. 

శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్త ఇప్పటికే బిగ్ బాస్ పై సంచలన ఆరోపణలు చేశారు. బిగ్ బాస్ ముసుగులో లైంగిక వేధింపులు, మహిళలని అవమానించే కార్యక్రమాలు జరుగుతున్నాయని శ్వేతా రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై కేసు నడుస్తోంది. ఇక బిగ్ బాస్ షోలో అశ్లీల దృశ్యాలు, మన సాంప్రదాయాలకు విరుద్ధమైన కార్యక్రమాలు చూపిస్తున్నారని కేతిరెడ్డి ఆరోపిస్తున్నారు. 

బిగ్ బాస్ షోని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం జులై 30న తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన కార్యక్రమం జరగబోతున్నట్లు కేతిరెడ్డి ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు పాల్గొనాలని కేతిరెడ్డి పిలుపునిచ్చారు.