అల్లు అర్జున్ కాంప్లిమెంట్స్ కు పూరి జగన్నాథ్ మురిసిపోతున్నారు. దాంతో బన్ని పేరు చెప్పి ఓ పెగ్ ఎక్‌ట్రా వేస్తానంటున్నారు. ఈ విషయాలని ఏదో పర్శనల్ గా ఫోన్ లలో మాట్లాడుకున్నది కాదు. ట్విట్టర్ లో పూరి స్వయంగా రాసుకొచ్చింది. ఇందరీ పూరి జగన్నాథ్ ఏం చేసారు. దానికి అల్లు అర్జున్ ఏం కాంప్లిమెంట్ ఇచ్చారో చూద్దాం. 

మొదట నుంచి పూరి జగన్నాథ్ సినిమా అంటే డైలాగులకు పెట్టింది పేరు. సమాజంలోని రకరకాల అంశాలను, హాట్ టాపిక్ లను తన డైలాగుల్లో కూర్చి సూటిగా వదులుతూంటారు. అందుకే అవి ఓ రేంజిలో పేలుతూంటాయి. అలా ఇన్నాళ్లూ ..తన మాటలను సినిమాల్లో హీరోలతో పలికించిన పూరి.. ఇప్పుడు తన ఆలోచనలు, సూచనలను పోడ్‌కాస్ట్ ద్వారా శ్రోతలతో పంచుకుంటున్నారు. 

జులై 8న ఈ పోడ్‌కాస్ట్‌ను పూరి మొదలుపెట్టగా వీటిని మంచి ఆదరణ లభిస్తోంది. సినీ ప్రముఖులు సైతం అద్భతం అంటూ కొనియాడుతున్నారు. బుధవారం (ఆగస్టు 12న) పూరి జగన్నాథ్ అప్‌లోడ్ చేసిన ఒక పోడ్‌కాస్ట్  అల్లు అర్జున్‌కు విపరీతంగా నచ్చేసింది.

పోడ్‌కాస్ట్ లో గడిచిన 60వేల సంవత్సరాలుగా దేశంలో ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మాట్లాడారు. ఇది కూడా ఆయన స్టైల్లోనే సాగింది. ఏ దేశంలో అయితే స్త్రీ గౌరవించబడుతుందో ఆ దేశాలే మనుగడ సాగిస్తాయని.. స్త్రీకి నరకం చూపించిన దేశాలన్నీ సంకనాకిపోయాయని పూరి అన్నారు.

అలాగే ‘‘అందగత్తెలకు కాదు ర్యాంప్ వాక్‌లు.. మగాడి తోడు లేకుండా తమ కాళ్ల మీద నిలబడ్డ ఆడవాళ్లకు పెట్టాలి ర్యాంప్ వాక్‌లు. స్వతంత్రంగా బతికగలిగే శక్తివంతమైన మహిళను ఈ దేశంలో సత్కరించాలి. వాళ్లే మన మిస్ ఇండియాలు’’ అని పూరి చాలా గొప్పగా చెప్పారు. ఈ మాటలు అల్లు అర్జున్‌ను ఎంతగానో ఆకర్షించాయి. ఇదే కాదు.. పూరి పోడ్‌కాస్ట్‌లన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన్ని ప్రశంసిస్తూ బన్నీ ఒక ట్వీట్ చేశారు.

‘‘పూరి గారు! ఎంత అద్భుతమైన అంశాలండి. మీ పోడ్‌కాస్ట్‌లలో చెబుతోన్న వ్యక్తిగత అభిప్రాయాలు నిజంగా లాగిపెట్టి కొడుతున్నట్టున్నాయి. అద్భుతం. నాకు చాలా బాగా నచ్చాయి. ఇలాంటి మంచి టాపిక్స్ మరెన్నో మీరు చర్చించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని బన్నీ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి పూరి స్పందించారు.

 ‘‘మీ ట్వీట్‌ను చదువుతూ నేను ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను బన్నీ. మీ లాంటి విజయవంతమైన యంగ్‌స్టర్ నుంచి ఇంత గొప్ప ప్రశంస అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రాత్రికి ఒక ఎక్‌ట్రా పెగ్ వేస్తా. చీర్స్.. లవ్ యు’’ అని పూరి పేర్కొన్నారు. బన్నీ కూడా ‘చీర్స్ సార్.. రెస్పెక్ట్’ అని రిప్లై ఇచ్చారు.