ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగారి గది చిత్రం 2015లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఆ చిత్రానికి సీక్వెల్ గా రాజుగారి గది2ని 2017లో ఓంకార్ తెరకెక్కించాడు. నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ఆ చిత్రం పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓంకార్ రాజుగారి గది 3ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. 

సైలెంట్ గా షూటింగ్ ఫినిష్ చేసేశాడు. ఓంకార్ సోదరుడు అశ్విన్, అవికా గోర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఓంకార్ ఈ చిత్రంలో మరింతగా హర్రర్ అంశాల డోస్ పెంచేశాడు. ట్రైలర్ లో కొన్ని మూమెంట్స్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. 

విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా రాజుగారి గది 3 ట్రైలర్ విడుదలైంది. 'ఇదే యక్షిని పాతేసిన చోటు' అనే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఈ చిత్రం కోసం వేసిన సెట్స్, అవికా గోర్ గెటప్ భయాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. 

ఈ కన్యని తాకాలని చూస్తే నీకు తప్పదు మరణం అంటూ అశ్విన్ చెబుతున్న డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.