చిత్రం : ఓం నమో వేంకటేశాయ నటీనటులు : నాగార్జున, అనుష్క, సౌరభ్ జైన్,విమలా రామన్, అస్మిత, రావు రమేష్ సంగీతం : ఎం.ఎం.కీరవాణి దర్శకత్వం : కె.రాఘవేంద్రరావు నిర్మాత : ఎ.మహేష్ రెడ్డి ఏసియానెట్ రేటింగ్-3.5/5
కథ...
ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్ ఓవర్ తో సినిమా ప్రారంభం అవుతుంది. 16 శతాబ్దానికి చెందిన రామ్ (నాగార్జున) చిన్నతనం నుంచీ దేవుడిని చూడాలనే కోరికతో జ్వలిస్తూంటాడు. దేవుడిని చూసే విద్య నేర్చుకోవాలంటూ చిన్నతనంలోనే ఇంట్లోంచి బయిటకు వచ్చి...తిరుమలలోని గురువు పద్మానంద స్వామి (సాయికుమార్) నడుపుతున్న వేద పాఠశాలలో చేరుతాడు. అక్కడే విద్య అభ్యసిస్తూ..ఆయన చెప్పిన మాటతో తపస్సుకు సైతం పూనుకుంటాడు. రామ భక్తికి మెచ్చిన వేంకటేశుడు, వటపత్రశాయిగా వచ్చి బాలుడి రూపంలో రామ తపోభంగం చేస్తాడు. అయితే బాలుడి రూపంలో వచ్చినది ఆ దేవదేవుడే అని గుర్తించ లేని రామ ఆగ్రహంతో వెళ్లిపొమ్మని శాసిస్తాడు.
ఆ బాధలో ఇంటికి వెళ్లిన రామానికి, మరదలు భవాని (ప్రగ్యాజైస్వాల్) తో పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు పెద్దలు. కానీ భగవంతుడిని దర్శించటమే తన జీవితాశయం అని భవానికి నచ్చజెప్పి తన ప్రయాణం మొదలు పెడతాడు. గురువు ద్వారా ఆ రోజు తన తపోభంగం చేసిన ఆ బాలుడే తాను చూడాలనుకుంటున్న బాలాజీ అని తెలుసుకొని తిరుమల కొండపైకి చేరుకుంటాడు. కొండమీదే ఆశ్రమంలో ఉండే కృష్ణమ్మ (అనుష్క) సాయంతో అధికారం చెలాయిస్తూ వెంకటేశ్వరుని సొమ్మును దోచుకుంటున్న గోవిందరాజులు (రావూ రమేష్) ను ఎదిరిస్తాడు.
కొండపైన జరుగుతున్న అన్యాయాలను మహారాజు (సంపత్ రాజ్)కు వివరించి గోవిందరాజులను పదవి నుంచి తప్పించి తిరుమల బాధ్యతలు స్వీకరిస్తాడు. అలా ఆ వేంకటేశుడి సేవకుడిగా మారిన రామ, హాథీరాం బాబాజీగా ఎలా మారాడు. కొండ మీద ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు. కొంతమంది వలన దేవుడిని చేరుకోలేకపోయిన రామ్ చివరికి స్వామిని స్వయంగా చూడాలన్న కోరిక ఎలా తీర్చుకున్నాడు అన్నదే మిగతా కథ.
నటీనటులు...
అన్నమయ్య, రామదాసు పాత్రలతో ఇప్పటికే ప్రేక్షకులను అలరించిన నాగార్జున హాథీరాం బాబాజీ పాత్రలో మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. భక్తుడి పాత్రలకు తాను తప్ప మరెవ్వరూ న్యాయం చేయలెరన్న స్థాయిలో ఉంది నాగార్జున నటన తీరు అమోఘం. అమాయకత్వం, ఆవేశం, కరుణ, భక్తి ఇలా అన్ని రసాలను అద్భుతంగా పలికించి హాథీరాం పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. బుల్లితెర కృష్ణుడు సౌరభ్ జైన్, వెండితెర మీద వెంకటేశ్వర స్వామిగా మరింత అందంగా కనిపించాడు. కృష్ణమ్మ పాత్రలో అనుష్క నటన బాగుంది. కొండకు చేరిన భక్తుడికి సరైన మార్గం చూపించే పాత్రలో హుందాగా కనిపించింది. విలన్ గా రావూ రమేష్ తనకు అలవాటైన నటనతో మెప్పించాడు. ఇతర పాత్రల్లో సంపత్ రాజ్, రఘుబాబు, సాయికుమార్ తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు...
నాగార్జునను అన్నమయ్య, శ్రీ రామదాసుగా చూపించి మెప్పించిన రాఘవేంద్రరావు, ఈ సారి హాథీరాం బాబాజీగా చూపించారు. చరిత్రలో హాథీరాంకు సంబంధించిన విషయాలు పెద్దగా లేకపోయినా.. ఉన్న కొద్ది పాటి సమాచారంతో గొప్ప చిత్రాన్ని రూపొందించారు. అందుకు తగ్గట్టుగా కల్పిత పాత్రలను జోడించిన రచయిత భారవి, చరిత్రలో ఔచిత్యం ఏ మాత్రం దెబ్బ తినకుండా జాగ్రత్త పడ్డారు. రాఘవేంద్రుడి ఆలోచనలను మరింత అందంగా తెరమీద ఆవిష్కరించాడు సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి. ముఖ్యంగా వందల ఏళ్లనాడు తిరుమల గిరులు ఎలా ఉండేవో.. ఎంత పచ్చదనం ఉండేదో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఇతర సాంకేతికాంశాలు కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్...
సినిమాకు నాగార్జున నటన ప్రముఖంగా ప్లస్ పాయింట్స్ లో చెప్పుకోవాల్సింది. ఇక ప్రతీ సీన్ లో లైవ్ లీగా ఉండేలా అద్బుతమైన సెటింగ్స్ వేసి కలర్ ఫుల్ గా తెరకెక్కించిన దర్శకులు రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనుష్క కృష్ణమ్మ పాత్రలో చక్కగా నటించింది.
మైనస్ పాయింట్స్...
ప్రత్యేకంగా మైనస్ పాయింట్స్ గురించి పెద్దగా చెప్పేదేమీ లేకున్నా లుక్స్ పరంగా భేష్ అనిపించిన సౌరభ్, నటనపై ఇంకాస్త దృష్టి పెడితే మరింత బాగుండేది.
చివరగా...
ఓం నమో వేంకటేశాయ, తిరుమల విశిష్టతను, హాథీరాం బాబా గొప్పతనాన్ని తెలిపే భక్తిరస చిత్రం
