కథ: 

చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతుక్కుంటూ వుంటాడు జీవా(అల్లు శిరీష్). ఒకరోజు జ్యో(సురభి)ను చూస్తాడు. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. జ్యో కూడా జీవాను ప్రేమిస్తుంది. జీవా, జ్యో వీరిద్దరి జీవితాల్లో జరిగే సంఘటనలే... అంతకముందే శ్రీనివాస్(అవసరాల శ్రీనివాస్), స్వాతి(సీరత్ కపూర్)ల జీవితాల్లో జరుగుతాయి. అంటే.. శ్రీనివాస్-స్వాతిల ప్రెజంట్, జీవా-జ్యో ల భవిష్యత్తు అన్నమాట. ఈ విషయం తెలుసుకున్న జ్యోలో టెన్షన్ మొదలవుతుంది. ఊహించని విధంగా స్వాతి హత్యకు గురవుతుంది. ఆ హత్య చేసింది నేనేనని శ్రీనివాస్ చెప్పడంతో అతడిని అరెస్ట్ చేస్తారు. దీంతో జ్యో తన జీవితంలో కూడా ఇలానే జరుగుతుందని జీవాకు దూరంగా వెళ్లిపోవాలనుకుంటుంది. మరి జీవా తన ప్రేమను, ప్రేమించిన అమ్మాయిని దక్కించుకున్నాడా..? స్వాతిని నిజంగానే శ్రీనివాస్ చంపాడా..? ఈ హత్య వెనుక ఉన్న కారణాలు ఏంటి..? జ్యో ను చావు నుండి జీవా ఎలా రక్షించుకున్నాడు..? అనేది వెండితెరపై చూడాల్సిందే! 

విశ్లేషణ:

ఒక్క క్ష‌ణం రెండు జంట‌ల స‌మాంత‌ర జీవితాల మ‌ధ్య సాగే క‌థ‌. ఓ జంట జీవితంలో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లే మ‌రో జంట జీవితంలోనూ జ‌రుగుతుంటాయి. ఈ నేప‌థ్యంలో రెండు జంట‌లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయన్న‌దే ఈ సినిమాలోని ప్రధాన అంశం. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు ద‌ర్శ‌కుడు తీసుకున్న కాన్సెఫ్ట్ బాగానే ఉన్నా నెరేష‌న్ స్ట్రాంగ్‌గా లేక‌పోవ‌డం మైన‌స్ అయ్యింది. ఇంట‌ర్వెల్‌లో అదిరిపోయే ట్విస్ట్‌ తో ద‌ర్శ‌కుడు సెకండ్ హాఫ్‌పై ఆస‌క్తిని పెంచాడు.

సెకండ్ హాఫ్‌లో కాస్త ల్యాగ్ ఉన్నప్పటికీ తరువాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. పతాక సన్నివేశాల్లో జోరు పెంచితే మరింత బాగుండేది. అతి తక్కువ క్యారెక్టర్లతో దర్శకుడు కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. నలుగురి జీవితాలను, ఒక యాక్సిడెంట్‌కు ముడిపెట్టిన తీరు అభినందనీయం. అల్లు శిరీష్ తన నటనలో బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఎమోషనల్, లవ్ ఇలా ప్రతి సన్నివేశాల్లో మెరుగు పడ్డాడు. అయితే ఇంకా తన నటన పరంగా మరింత న్యాయం చేయాలి. సురభి, సీరత్ కపూర్ గ్లామరస్‌గా కనిపించారు. సీరత్ కపూర్ పాత్ర ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. అవసరాల శ్రీనివాస్ తన పాత్రలో ఇమిడిపోయాడు. సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించిన దాసరి అరుణ్ కుమార్‌కు ఈ సినిమాతో మరిన్ని అవకాశాలు వస్తాయనేది ఖాయం.


టెక్నికల్‌గా సినిమాను క్వాలిటీతో తెరకెక్కించారు. కథ మొత్తం ఒక అపార్ట్మెంట్ లోనే చిత్రీకరించినా.. ఎక్కడా బోర్ అని అనిపించదు. ఉన్న లొకేషన్స్‌ ను అందంగా చూపించారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండా ఈ సినిమాను ఊహించలేము. అంత అద్భుతమైన నేపధ్య సంగీతాన్ని అందించారు. పాటలు కూడా బాగున్నాయి.

 

ప్లస్ మైనస్ ల విషయానికొస్తే సినిమాకు సెకండాఫ్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌, నటీన‌టులు పాత్ర‌లు ప్ల‌స్. ఇక మైన‌స్‌ల విష‌యానికి వ‌స్తే ఫ‌స్టాఫ్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ లేక‌పోవ‌డం, వెరీ స్లో స్క్రీన్ ప్లే. ఓవ‌రాల్‌గా చూస్తే ఎక్కడికి పోతావు చిన్నవాడా తరహాలోనే వి ఐ ఆనంద్ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

చివరగా:

లవ్ థ్రిల్ల‌ర్ సినిమాలు ఇష్ట‌ప‌డే వారికి తప్పక న‌చ్చుతుంది