మహేష్‌ బాబు, శ్రీలీల నటించిన `గుంటూరు కారం` చిత్రం నుంచి రెండో పాట విడుదలైంది. `ఓ మై బేబీ` అంటూ సాగే ఈ పాట ఎలా ఉందో ఓ లుక్కేయండి. 

మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ `గుంటూరు కారం`. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరీ సెకండ్‌ హీరోయిన్‌గా చేస్తుంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ సంక్రాంతికి రాబోతుంది. ఓ వైపు షూటింగ్‌ చివరి దశకు చేరుకుంటుంది. మరోవైపు ప్రమోషన్‌ కార్యక్రమాల స్పీడ్‌ పెంచుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్‌, మొదటి పాట విడుదలై ఆకట్టుకుంది. 

ఇప్పుడు రెండో పాటని విడుదల చేశారు. రెండు రోజుల క్రితం `ఓ మై బేబీ` అంటూ సాగే పాట ప్రోమోని విడుదల చేశారు. తాజాగా పూర్తి పాటని విడుదల చేశారు. థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ పాట మహేష్‌బాబు, శ్రీలీలపై వస్తుంది. మహేష్‌, శ్రీలీల మధ్య ప్రేమని తెలియజేసేలా, లవ్‌ మేకింగ్‌గా ఈ సాంగ్‌ ఉండబోతుంది. ఈ పాటని శిల్పా రావు ఆలపించగా, రామజోగయ్య శాస్త్రి రాశారు. కూల్ మెలోడీగా ఈ పాట ఉంది. జస్ట్ కూల్‌గా సాగుతుంది. అయితే పెద్దగా హంట్‌ చేసేలా మాత్రం అనిపించడం లేదు. కిక్ ఇచ్చేలా ఈ పాట లేదనే పెదవి విరుపు వినిపిస్తుంది. 

ఇక త్రివిక్రమ్‌ తనలోని మాస్‌ డైరెక్టర్‌ని బయటకు తీస్తున్నారు. `గుంటూరు కారం` చిత్రాన్ని పూర్తి మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేష్‌బాబు యాస, డైలాగ్‌ డెలివరీ, మాస్‌ లుక్‌ అదిరిపోయేలా ఉంటాయట. ఇప్పటికే టీజర్‌లో ఆ విషయం తెలుస్తుంది. ఏకంగా లుంగీ కట్టి కూడా కనిపించాడు. చాలా రోజుల తర్వాత మహేష్‌ నుంచి పూర్తి మాస్‌ యాంగిల్‌ని బయటకు తీస్తున్నారని అర్థమవుతుంది. 

చాలా గ్యాప్‌ తర్వాత మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో `గుంటూరు కారం` చిత్రం వస్తోంది. గతంలో `అతడు`, `ఖలేజా` చిత్రాలు వచ్చాయి. `అతడు` మెప్పించింది. థియేటర్ల కంటే టీవీలో బాగా ఆదరణ పొందింది. `ఖలేజా` డిజాస్టర్‌ అయ్యింది. దీంతో ఇప్పుడు హిట్‌ కొట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే విడుదలైన మొదటి పాట `ధమ్‌ మసాలా` విశేష ఆదరణ పొందింది. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అయ్యింది. మరి ఆ స్థాయిలో రెండో పాట అలరిస్తుందా చూడాలి. ఇక `గుంటూరు కారం` చిత్రాన్ని హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ మూవీని సంక్రాంతి పండక్కి జనవరి 12న విడుదల చేస్తున్నారు. 

YouTube video player

Read more: కూతురు కంటే కాస్త పెద్దది, శ్రీలీలతో మహేష్ రొమాన్స్ పై ట్రోలింగ్.. బేబీ నిర్మాత కౌంటర్