Asianet News TeluguAsianet News Telugu

రివ్యూ: ఆఫీసర్

'శివ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రామ్ గోపాల్ వర్మ.. మొదటి చిత్రంతోనే మంచి 

officer movie telugu review

నటీనటులు : నాగార్జున, 'బేబీ' కావ్య, మైరా సరీన్, అన్వర్ ఖాన్, ఫిరోజ్ అబ్బాసీ, షాయాజీ షిండే, అజయ్ తదితరులు 
ఛాయాగ్రహణం : భరత్ వ్యాస్, రాహుల్ పెనుమత్స 
సంగీతం : రవిశంకర్ 
దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
నిర్మాతలు : రామ్ గోపాల్ వర్మ, సుధీర్ చంద్ర  

'శివ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రామ్ గోపాల్ వర్మ.. మొదటి చిత్రంతోనే మంచి మార్కులు సంపాదించుకున్నాడు. ఈ సినిమా తరువాత టాలీవుడ్ లో కొత్త తరహా సినిమాలు రావడం మొదలయ్యాయి. కొంతకాలం పాటు తన సినిమాలతో సంచలనం సృష్టించిన వర్మ ఇప్పుడు సోషల్ మీడియాలో తరచూ ఏవోక కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయనతో హీరోలు సినిమాలు చేయడం కూడా తగ్గించేశారు. అటువంటిది వర్మను నమ్మి ఆయనకు మరో ఛాన్స్ ఇచ్చాడు నాగార్జున. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన 'ఆఫీసర్' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
నారాయణ్ పసారి(అన్వర్ ఖాన్) ముంబైలో పెద్ద పోలీస్ ఆఫీసర్. అండర్ వరల్డ్ ను అంతం చేసి డిపార్ట్మెంట్ లో గొప్ప పేరు తెచ్చుకుంటాడు. కానీ అతడిలో మరో కోణం కూడా ఉంటుంది. డబ్బు కోసం అక్రమాలు చేస్తుంటాడు. ఓ కేసుకి సంబంధించి అతడిపై ఆరోపణలు వస్తాయి. వాటిపై విచారణ చేపట్టాలని ముంబై కోర్టు హైదరాబాద్ కు చెందిన శివాజీరావు(నాగార్జున)ని స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తుంది. పసారిపై ఉన్న ఆరోపణలు నిజమేనని తన ఇన్వెస్టిగేషన్ లో తెలుసుకుంటాడు శివాజీరావు. దీంతో అతడిని అరెస్ట్ చేస్తాడు. కానీ పసారి తన పలుకుబడితో సాక్షిని చంపిస్తాడు. కోర్టు ఆధారాలు లేకపోవడంతో పసారిని నిర్దోషిగా విడుదల చేస్తుంది. అలా బయటకు వచ్చిన పసారి మళ్లీ పోలీస్ ఆఫీసర్ గా చార్జ్ తీసుకుంటాడు. కావాలనే ఓ అండర్ వరల్డ్ టీమ్ ను సిద్ధం చేసి అక్రమాలు చేస్తుంటాడు. ఆ నేరం శివాజీరావుపై వేయాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నట్లుగానే తెలివిగా అతడిని ఇరికిస్తాడు. మరి ఈ సమస్యల నుండి శివాజీరావు ఎలా బయటపడ్డాడు..? తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని ఎలా నిరూపించుకుంటాడు..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

కళాకారుల పనితీరు: 
ఈ సినిమాకు ప్లస్ ఏదైనా ఉందంటే అది నాగార్జున అనే చెప్పాలి. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేశాడు. సినిమా మొత్తాన్ని తనే నడిపించాడు. నటన పరంగా ఎలాంటి వంక పెట్టలేం. పసారి అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో అన్వర్ ఖాన్ నటన చికాకు కలిగిస్తుంది. బలమైన విలన్ ను పెట్టాల్సిన స్థానంలో వర్మ అతడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో అర్ధం కాదు. తెలుగువారికి పరిచయమున్న నటుడు ఆ రోల్ పోషించి ఉంటే బాగుండేది. సినిమాకు ప్రధానమైన విలన్ క్యారెక్టర్ పండకపోవడంతో విసుగొస్తుంది. ఇక నాగార్జున కూతురి పాత్రలో నటించిన బేబీ కావ్య కాస్త అతి చేసింది. మైరా సరీన్ కు అసలు యాక్టింగే రాదని క్లియర్ గా తెలుస్తుంది. ఓ పాటలో తన క్లీవేజ్ షోతో ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది. అజయ్ పోలీస్ ఆఫీసర్ గా మెప్పిస్తాడు. ఇక తెలుగు ఆడియన్స్ కు పరిచయమున్న ముఖాలు తెరపై ఎక్కడా కనిపించవు. 

సాంకేతికవర్గం పనితీరు: 
వర్మ సినిమాలంటే క్వాలిటీకి అద్దం పట్టేవి. టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌లో ఉండేవి. అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు, పేరున్న తారాగణంతో తనదైన శైలిలో సినిమాలు తీసి భారతీయ సినిమాపై చెరిగిపోని ముద్ర వేసిన వర్మ ఇప్పుడు సాంకేతిక విలువలకి అంతగా విలువ ఇవ్వకపోవడం విడ్డూరమనిపిస్తుంది. నేను మారిపోయాను. క్వాలిటీ సినిమాలే తీస్తానంటూ వర్మ చెప్తుండొచ్చు, దానికోసం నిజంగానే తపిస్తుండవచ్చు, కానీ ఆయన సినిమాల్లో మునుపు కనిపించిన గొప్ప లక్షణాలు, వాటిని చరిత్రలో నిలిపిన ఉత్తమ సాంకేతిక విలువలు మాత్రం ఇప్పుడు కానరావడం లేదు. సినిమాలో పాటలు, కెమెరా వర్క్, ఎడిటింగ్ ఏ ఒక్క డిపార్ట్మెంట్ వర్క్ కూడా ఆకట్టుకోదు. పైగా వర్మ కెమెరా యాంగిల్స్ విసిగిస్తాయి.

విశ్లేషణ: 
లఘు చిత్రం చేయాల్సిన కథతో వర్మ సినిమా తీసేశాడు. ఈ సినిమాను చెప్పాలంటే గట్టిగా అరగంటలో తీసి చూపించొచ్చు. అటువంటి కథను రెండు గంటల పాటు సాగదీసి సాగదీసి ప్రేక్షకులను విసిగించాడు వర్మ. సినిమాలో ఈ సీన్ బాగుందని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేకపోవడం బాధాకరం. వర్మ ఏ సినిమా కోసం కూడా ఇంత టైమ్ తీసుకోలేదు. దీంతో ఆఫీసర్ సినిమాను బాగా చెక్కుతున్నాడేమో అని అందరూ అనుకున్నారు. ప్రచార చిత్రాలు విడుదలైనప్పుడే ఈ సినిమా ఎలా ఉండబోతుందో హింట్స్ ఇచ్చేశాడు. అవి చూసి ఇక థియేటర్ కు వెళ్తే మాత్రం అది మన పొరపాటే. వర్మ చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉన్నా.. దాన్ని ఆవిష్కరించిన తీరు కథనం నడిపించిన విధానం ఏమాత్రం ఆకట్టుకోదు. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ ఫైట్ ను కావాలనే డ్రాగ్ చేశాడనిపిస్తుంది. తన టేకింగ్ తో వర్మ మరోసారి ఆడియన్స్ ను విసిగిస్తాడు. అతడిపై అంత నమ్మకం పెట్టుకొని సినిమా చేసిన నాగార్జునకి నిరాశే మిగిలింది. 

రేటింగ్: 1.5/5 

Follow Us:
Download App:
  • android
  • ios