ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వివాదాలలో చిక్కుకున్నాయి. మనోభావాలు దెబ్బ తిన్నాయని ఒకవర్గం వారు సినిమాలో కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం తెలుపుతూ గొడవ చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన 'వాల్మీకి' సినిమా విషయంలో కూడా అదే జరిగింది. సినిమా రిలీజ్ కి మరో ఆరు గంటలు ఉందనగా అప్పుడు సినిమా టైటిల్ ని మార్చుకోవాల్సి 
వచ్చింది. తాజాగా 'సైరా నరసింహారెడ్డి' సినిమాపై కూడా వివాదం చెలరేగింది.

సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటామని ఒడిసాలోని కళింగసేన పార్టీ హెచ్చరించింది. 1846లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తొలి విప్లవం జరిగిందని తెలుపుతూ సినిమాను తెరకెక్కించారు. అయితే, ఇది తప్పని కళింగసేన పార్టీ అంటోంది. వాస్తవానికి 200 ఏళ్ల కిందటే 1817లో ఒడిశాలో తొలి స్వాతంత్య్ర పోరాటం జరిగిందని వాదిస్తోంది.

ఈ క్రమంలో భువనేశ్వర్ లో 'సైరా' సినిమాను ప్రదర్శించనున్న శ్రీయ థియేటర్‌ వద్ద కళింగసేన పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.ఆందోళనకారులు అమితాబ్ బచ్చన్, చిరంజీవి దిష్టిబొమ్మలు దహనం చేసి, పోస్టర్లకు నిప్పంటించారు. అనంతరం కళింగసేన కార్యదర్శి  మాట్లాడుతూ.. ఖుర్దా ప్రాంతం ప్రజలు పయికొ విప్లవం పేరిట తొలి పోరాటంచేశారని.. దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించిందని అన్నారు. 

2017లో అప్పటి రాష్ట్రప్రతి ప్రణబ్ ముఖర్జీ కూడా పయికొ విప్లవం మొదటిదిగా ప్రకటించారని చెప్పారు. 'సైరా' దర్శకుడు సినిమాను తప్పుగా చిత్రీకరించి ఒడిసా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని.. రాష్ట్రంలో ఈ సినిమాను ప్రదర్శించనివ్వమని అన్నారు.