నేపోటిజం అని ఎందరు ఎంత రాద్దాం చేసినా, ప్రతి రంగంలో ఇది ఉంటుంది. పాలిటిక్స్ మరియు సినిమాలు పబ్లిక్ డొమైన్ కావడంతో ఇక్కడ దీని ప్రభావం,చర్చ ఎక్కువగా ఉంటుంది. సినిమా అనే కళలో ఎక్కువ పేరొచ్చేది ఒక్క హీరోకి మాత్రమే. వెండి తెరపై సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగితే ఆ గౌరవం, హోదా, ఫ్యాన్స్, ఫాలోయింగ్ అంతా వేరుగా ఉంటుంది. అన్నింటికీ మించి ఒక సినిమా నిర్మాణంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరో సంపాదన గురించి చెప్పాల్సిన పనిలేదు.అందుకే  హీరో కొడుకులే కాదు, చిత్ర పరిశ్రమతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి వారసులు ఫ్రీ పాస్ తీసుకొని ఈజీగా హీరోలవ్వాలని కోరుకుంటారు. 

ఇక స్టార్ హీరోల కుటుంబం నుండైతే మేనల్లుళ్లు, అల్లుళ్ళు, తమ్ముళ్లు వచ్చేస్తుంటారు. ఈ మధ్య బావమరుదులు కూడా హీరోలుగా మారడం చూస్తునాం. ఇప్పటికే మహేష్ బాబు సిస్టర్ భర్త సుధీర్ హీరోగా ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఓ స్థాయిగా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావ మరిదికి కూడా హీరో కావాలని మనసైనదట. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తమ్ముడు నార్నె నితిన్ హీరో అరంగేట్రానికి రంగం సిద్ధం అవుతుందని తెలుస్తుంది. 

నితిన్ కోసం ఇప్పటికే కథలు, దర్శకులను వెతికే పనిలో కుటుంబ సభ్యులు ఉన్నారట. అన్నీ కుదిరితే నార్నె నితిన్ మూవీ 2021లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. నితిన్ తండ్రి ప్రముఖ పారిశ్రామిక వేత్త నార్నె శ్రీనివాసరావు కావడంతో  ఆయనే నిర్మాతగా మారి సినిమా నిర్మిస్తారనే మాట కూడా వినిపిస్తుంది. అలాగే ఎన్టీఆర్ కూడా సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ కొత్తగా స్థాపించబోయే బ్యానర్ లో కూడా ఈ మూవీ తెరకెక్క వచ్చు.