గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందబోయే చిత్రం ఆపేసారంటూ,వాయిదాపడిందంటూ వార్తలు వస్తున్నాయి. దానికి తోడు సినిమా లాంచ్ అయ్యాక ..ఎక్కడా అప్ డేట్స్ లేవు. దాంతో ఈ విషయంపై ఎన్టీఆర్ అభిమానులు కంగారుపడుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ టాపిక్ పై ఫ్యాన్స్ తెగ చర్చలు చేస్తున్నారు. దాంతో ఈ రూమర్స్ కు చెక్ చెప్పాలనుకున్నారు నిర్మాత నాగ వంశీ. ఆయన తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా స్పందించారు. అయితే ఈ విషయాన్ని డైరక్ట్ గా ఎత్తకుండా...భలే జోక్ వేసారే అంటూ ఫన్నీ ఎమోజస్ ని ట్వీట్ చేసారు. దాంతో ఈ టాపిక్ గురించే ఆయన మాట్లాడుతున్నారని అందరికీ అర్దమైంది. 

 అర‌వింద‌స‌మేత వీరరాఘ‌వ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందబోయే  చిత్రం గురించి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.  ‘ఎన్టీఆర్‌ 30’ వర్కింగ్‌ టైటిల్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి ‘అయినను పోయి రావలె హస్తినకు’, ‘చౌడప్ప నాయుడు’ వంటి టైటిల్స్ ను చిత్రటీమ్  పరిశీలిస్తున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మరి ఈ రెండింటిలో ఏ టైటిల్ ను ఫైనల్‌ చేస్తారా? లేదా మరో టైటిల్  పెడతారనేది తెలియాల్సి ఉంది. ఇందులో హీరోయిన్ గా రష్మిక, పూజా హెగ్డేల పేర్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్‌ - ఎన్టీఆర్‌ చిత్రంలోనే తెలుగు సినీరంగ ప్రవేశం చేస్తుందనే వార్తలు అప్పట్లో వైరలయ్యాయి.

అలాగే హారిక అండ్ హాసిని క్రియేషన్స్, యన్.టి.ఆర్. ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రస్తుతం ప్రభాస్‌ రాముడిగా ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్‌’ చిత్రంలో రావణుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రంలో కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.