పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేసి, దాన్ని వెండితెరపై రక్తికట్టించంలో తాతకి తగ్గ మనవడు అనిపించుకున్నారు ఎన్టీఆర్. ఇటీవల మరోసారి తాత ఎన్టీఆర్ గురించి స్పందించారు జూ.ఎన్టీఆర్.
రూపంలో అచ్చు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు(సీనియర్ ఎన్టీఆర్)ని పోలి ఉంటారు యంగ్ టైగర్ ఎన్టీఆర్(జూ.ఎన్టీఆర్). అందుకేనేమో ఆయనకు తాతగారి పేరునే పెట్టారు. తాతగారి నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుని అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారు తారక్. పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేసి, దాన్ని వెండితెరపై రక్తికట్టించంలో తాతకి తగ్గ మనవడు అనిపించుకున్నారు ఎన్టీఆర్. తాతగారు నటించిన `బ్రహ్మర్షి విశ్వామిత్ర` చిత్రంతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు తారక్.
ఇప్పుడు హీరోగా ముప్పై సినిమాల వరకు చేరుకున్నారు. ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్` సినిమాలో నటించి అదరగొట్టారు. రాజమౌళి రూపొందించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్‌తో కలిసి ఎన్టీఆర్ నటించారు. కొమురంభీమ్ పాత్రకి ప్రాణం పోశారు. అద్బుతమైన ఎమోషన్స్ తో ఫిదా చేస్తున్నారు. ఈ చిత్రం మార్చి 25న విడుదలై విజయవంతంగా దూసుకుపోతుంది. భారీ కలెక్షన్లని రాబడుతుంది. ఈ క్రమంలో ఇటీవల చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎన్టీఆర్. అందులో భాగంగా మరోసారి తాత ఎన్టీఆర్ గురించి స్పందించారు.
ఓ టీవీ ఇంటర్య్వూలో ఎన్టీఆర్.. తాత సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్నదేంటనేది ప్రశ్నకి స్పందించారు. తాతగారు గొప్ప నటుడు, రాజకీయ నాయకుడే కాకుండా దేశంలోని గొప్ప పౌరుడని, ఆయన్నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని చెప్పారు తారక్. మనం ఇప్పటి వరకు ఎంతో పొందాం. సమాజానికి మనం ఏదైనా చేయాలనేది, ఈ దేశ పౌరుడిగా మనం పొందిన ప్రేమని ఇతరులకు కూడా పంచాలనేది తాతగారి నుంచి నేర్చుకున్నానని చెప్పారు. అయితే ఆ ప్రేమని తన అభిమానులకు ఎలా అందివ్వాలి అనేది ఎప్పుడూ ఆలోచిస్తుంటాని తెలిపారు.
`నేను బాధగా ఉంటే వారు బాధపడతారు. నేను హ్యాపీగా ఉంటే వారి హ్యాపీ. ఇది ఒక అద్భుతంగా అనిపిస్తుంటుంది. ఫ్యాన్స్ ని ఎప్పుడూ సంతోషంగా ఉంచాలనేది తాతగారి నుంచి తెలుసుకున్నా. వాళ్లని ఎలా సంతోషంగా ఉంచగలనంటే మంచి సినిమాలు చేయడం ద్వారానే అనేది తెలుసుకున్నా. ఆ దిశగా అడుగులు వేస్తున్నా` అని పేర్కొన్నారు ఎన్టీఆర్. ఇదిలా ఉంటే తాతగారి పాత్రల్లోగానీ, ఆయన సినిమాలు రీమేక్‌లో నటించేందుకుగానీ తారక్ సిద్ధంగా లేరు. తాను ఎప్పుడూ ఆయన పాత్రలో నటించనని, రీమేక్‌లు చేయనని ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేశారు ఎన్టీఆర్.
మరోవైపు `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గుర్తింపుని తెచ్చుకున్నారు ఎన్టీఆర్. త్వరలో ఆయన కొరటాల శివ దర్శకత్వంలో సినిమాని ప్రారంభించబోతున్నారు. ఈ లోపు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ ప్లాన్ చేసినట్టు సమాచారం. అనంతరం కొరటాల చిత్ర షూటింగ్‌ని ప్రారంభించనున్నారట. మరోవైపు బుచ్చిబాబుతో సినిమాని కూడా వెంటనే పట్టాలెక్కించబోతున్నట్టు సమాచారం. దీంతోపాటు ప్రశాంత్ నీల్ తో కూడా ఓ కమిట్‌మెంట్ ఉంది తారక్‌కి.
