Asianet News TeluguAsianet News Telugu

NTR..విజయశాంతికి క్షమాపణ చెప్పడానికి కారణం?

సారీ “జరిగింది పొరపాటు మాత్రమే అమ్మా, ఐయామ్ ఎక్స్‌ట్రీమ్లీ సారీ .” అని చెప్పినంతవరకూ.. సాటి కళాకారుల గౌరవాన్ని కాపాడే బాధ్యతను విస్మరించని ఆ మహోన్నత వ్యక్తిని 

NTR said sorry to Vijayashanthi for making a mistake
Author
First Published May 29, 2023, 7:46 PM IST


విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి వేడుకలు  నేపథ్యంలో ఆయనకు సంబంధించిన జీవిత విశేషాలు అందరూ మాట్లాడుతున్నారు. అందుకు సంభందించిన వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ వస్తున్నాయి.  చాలా మంది సినీ సెలబ్రెటీలు ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. లేడీ అమితాబచ్చన్ విజయశాంతి గారు తారకరాముడుని ను గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారు. మరి అదే విధంగా ఆయనతో ఉన్న అనుబంధాలను, జ్ఞాపకాలను ఆమె తలుచుకుంటూ తన సోషల్ మీడియా వేదికగా ఓ విషయాన్ని తెలియజేశారు. 

విజయశాంతి ట్వీట్ చేస్తూ.... ‘ సుమారు 1980ల్లో నేను 14 సంవత్సరాల చిన్న పిల్లగా, నా సినిమా జీవిత ప్రయాణ ప్రారంభ సంవత్సరాలలో సత్యంశివం సినిమాలో చెల్లెలిగా ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారితో కలిసి నటించే అవకాశం కలిగింది. ఆ తర్వాత 1985లో నా ప్రతిఘటన చిత్రానికి ఉత్తమనటిగా నంది అవార్డును ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ నాకు అందించి, అభినందించి, ప్రజాప్రాయోజిత చిత్రాలలో మరింతగా కొనసాగాలని ఆశీర్వదించారు. నటునిగా, నాయకునిగా వారిది తిరుగులేని జీవన ప్రస్తానం. ఇక ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వానికి చిన్న ఉదాహరణ’ అంటూ ట్వీట్ చేశారు. ఆ సమయంలోనే మరో ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.

 
అలాగే ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రం డబ్బింగ్ ఎన్టీఆర్ గారు ఏవీఎం స్టూడియోలో చెబుతున్నప్పుడు.. 1990లో నేను చిరంజీవిగారితో అదే స్టూడియోలో సినిమా చేస్తూ వారిని డబ్బింగ్ థియేటర్‌లో కలవడానికి వెళ్లాను. డబ్బింగ్ థియేటర్లో వెలుతురు లేని వాతావరణంలో వారు నన్ను సరిగా గమనించలేదని బాధపడ్డాను. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ గారు తర్వాతి రోజు ఉదయం 6 గంటలకే మద్రాసులో మా ఇంటికి వచ్చి, (నేను ఆ ఉదయం ప్లయిట్‌కి హైదరాబాదులో షూటింగ్‌కి వెళ్లాను) అమ్మాయిని మేము చూసుకోలేదు. పొరపాటు జరిగింది, ఐయామ్ సారీ, బిడ్డకు తెలియజేయండి అని శ్రీనివాస్ ప్రసాద్ (విజయ శాంతి భర్త) గారితో చెప్పిన సంఘటన ఎన్ని సంవత్సరాలైనా గుర్తుగానే, గౌరవంగానే మిగులుతుంది. అంతేగాక, ఆ రోజు నేను హైదరాబాదులో ఉన్న ఫోన్ నెంబర్ తెలుసుకుని, ఫోన్ చేసి మరీ “జరిగింది పొరపాటు మాత్రమే అమ్మా, ఐయామ్ ఎక్స్‌ట్రీమ్లీ సారీ .” అని చెప్పినంతవరకూ.. సాటి కళాకారుల గౌరవాన్ని కాపాడే బాధ్యతను విస్మరించని ఆ మహోన్నత వ్యక్తిని ఎంతగా ప్రశంసించినా తక్కువే..’ అని ట్వీట్ చేశారు.

 

‘ ఎన్టీఆర్ గారు మద్రాస్ వచ్చిన సందర్భాలలో మధ్యాహ్నం 11 గంటలకల్లా లంచ్ మా ఇంటి నుంచి శ్రీనివాస్ ప్రసాద్  పంపడం, ఎన్టీఆర్ గారు ఎంతో ఆప్యాయంగా స్వీకరించటం జరిగేది. అదే గాకుండా, నేను వారిని కలవడానికి హైదరాబాదులో ఎంతో బిజీగా ఉన్న సమయంలో వెళ్లినా కూడా స్వయంగా టిఫిన్ వడ్డించి తినిపించేవారు. ఆయన ఆతిథ్యానికి మారుపేరు .ఆదరాభిమానాలకు మరో రూపు… ఎన్టీఆర్ గారు బహుశా ప్రపంచం తిరిగి ఎప్పటికీ చూడలేని అరుదైన ఒక కారణజన్ముడు, యుగపురుషుడు. 100 సంవత్సరాలైనా.. మరో వంద సంవత్సరాలైనా.. సినిమాకి ఎన్టీఆర్ నేర్పిన క్రమశిక్షణా విధానాలు ఎప్పటికీ శిరోధార్యాలే… సినిమా కళాకారులకు వారు నిర్దేశించిన ప్రమాణాలు నిరంతరం ప్రాతఃస్మరణీయాలే.’అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రస్తుత బీజేపీ నేత విజయ శాంతి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios