ఎన్టీఆర్‌ హీరోగా తన 30వ చిత్రాన్ని ప్రకటించారు. ఉగాది పండుగని పురస్కరించుకున్న తాను నటించబోతున్న కొత్త సినిమా వివరాలను వెల్లడించారు. తనకి `జనతా గ్యారేజ్‌` వంటి సూపర్‌ హిట్‌ చిత్రాన్ని అందించిన కొరటాల శివతో సినిమాని చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ సినిమాని సోమవారం సాయంత్రం వెల్లడించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్ నందమూరి కళ్యాణ్‌ రామ్‌ సమర్పణలో యువసుధా ఆర్ట్స్ పతాకంపై సుధాకర్‌ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని కూడా ఇప్పుడే ప్రకటించడం విశేషం. ఈ సినిమాని జూన్‌ సెకాండాఫ్‌లో ప్రారంభించి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. 

తెలుగు సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ తన నెక్ట్స్ సినిమాని ప్రకటించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కాబోతుందట. అయితే ఈ సారి `నేషనల్‌ స్థాయిలో రిపేర్లు చేయబడును` అని క్యాప్షన్‌ పెట్టడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన సామాజిక చిత్రం `జనతా గ్యారేజ్‌`లో `ఇచట అన్ని రకాల రిపేర్లు చేయబడును` అని పెట్టారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో రిపేర్లు చేయబడును అని చెప్పడం ఆసక్తిని, సస్పెన్స్ ని క్రియేట్‌ చేస్తుంది. అంటే ఇది `జనతా గ్యారేజ్‌`కి సీక్వెల్‌గా ఉంటుందా? లేక పాన్‌ ఇండియా లెవల్‌లో ఉంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఎన్టీఆర్‌, కొరటాల కాంబినేషన్‌లో సినిమా మరింత క్రేజ్‌ని సొంతం చేసుకుంది. 

ప్రస్తుతం ఎన్టీఆర్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌, చరణ్‌ సరసన అలియా భట్‌ నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 13న విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ తన `ఎన్టీఆర్‌30`ని గతంలో త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ప్రకటించారు. ఇప్పుడు ఆ సినిమా ప్లేజ్‌లో కొరటాల రావడం గమనార్హం. దీంతో అభిమానులు షాక్‌కి గురవుతున్నారు. అయితే ఇది కొరటాల తర్వాత ఉంటుందా? లేక ఆగిపోయిందా? అన్నది సస్పెన్స్ గా మారింది.

ప్రస్తుతం కొరటాల.. చిరంజీవితో `ఆచార్య` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రామ్‌చరణ్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కాజల్‌ కథానాయికగా నటిస్తుంది. పూజా హెగ్డే.. చరణ్‌ సరసన కనిపించనుంది. మ్యాట్నీ ఎంటర్ టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయనున్నారు. కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కొరటాల తన నెక్ట్స్ సినిమాని బన్నీతో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా విషయంలోనూ సస్సెన్స్ నెలకొంది.