సిద్దు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన `టిల్లు స్వ్కేర్‌` మూవీ కలెక్షన్ల పరంగా దుమ్మరేపుతుంది. దీంతో ఎన్టీఆర్‌ గెస్ట్ గా భారీ ఈవెంట్‌ని ప్లాన్‌ చేస్తుంది టీమ్‌.  

చిన్న సినిమా పెద్ద విజయం అనే నానుడిని మరో సినిమా నిరూపించుకుంది. `టిల్లు స్వ్కేర్‌` బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. `డీజే టిల్లు`కి సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ సీక్వెల్స్ హిట్ కావు అనే సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేస్తూ సంచలనాలు సృష్టిస్తుంది. ఈ సినిమా వంద కోట్ల దిశగా వెళ్తుంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ వీకెండ్‌లో ఇది వంద కోట్ల క్లబ్‌లోకి వెళ్తుందని చెప్పొచ్చు. 

సిద్దు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన `టిల్లు స్వ్కేర్‌` చిత్రానికి మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహించారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. గత శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. ప్రారంభం నుంచి సినిమా మంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. టిల్లు క్యారెక్టరైజేషన్‌ సినిమాని నడిపించింది. ఆయన డైలాగులు, ఎక్స్ ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్‌ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. దీనికితోడు అనుపమా పరమేశ్వరన్‌ బోల్డ్ అవతార్‌ సినిమాకి మరింత ప్లస్‌ అయ్యింది. 

ఈ సినిమా ఎనిమిది రోజుల్లో 96.6కోట్ల గ్రాస్‌ సాధించింది. ఈ లెక్కన ఇది ఏకంగా 45కోట్ల షేర్‌ సాధించింది. సినిమా బిజినెస్‌ 25కోట్లు. దీంతో ఇప్పటికే బయ్యర్లకి ఇది లాభాల పంట పండిస్తుంది. ఇంకా లాంగ్‌ రన్‌ ఈ మూవీకి ఉండటం విశేషం. ఈజీగా వంద కోట్లు దాటి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇది చిన్న సినిమాల్లో పెద్ద విజయంగా చెప్పొచ్చు. నిర్మాతలు కూడా ఈ రేంజ్‌ సక్సెస్‌ని ఊహించలేదంటే అతిశయోక్తి కాదు. 

ఇదిలా ఉంటే `టిల్లు స్వ్కేర్‌` కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న నేపథ్యంలో టీమ్‌ ఈ సంతోషాన్ని భారీగా సెలబ్రేట్‌ చేసుకోవాలని నిర్ణయించుకుంది. అభిమానుల సమక్షంలో ఈ సెలబ్రేషన్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అయితే అందుకు ఎన్టీఆర్‌ని గెస్ట్ గా తీసుకొస్తున్నారు. ఇటీవలే తారక్‌కి టీమ్‌ సినిమాని చూపించారు. ఇందులో సిద్దు, విశ్వక్‌ సేన్‌, నాగవంశీ పాల్గొన్నారు. అప్పుడే హింట్‌ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని నిజం చేశారు. ఏప్రిల్‌ 8న(సోమవారం) గ్రాండ్‌గా `టిల్లు స్వ్కేర్‌` సక్సెస్‌ మీట్‌ చేస్తుండటం విశేషం. తాజాగా ఈ విషయాన్ని టీమ్‌ ప్రకటించింది. వేదికపై క్లారిటీ రావాల్సి ఉంది.