నందమూరి నటవృక్షం నుంచి మరో కొమ్మ రాబోతోంది. సీనియర్ ఎన్టీఆర్ నటవారసత్వాన్ని తీసుకుని మరో మనవడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. నందమూరి ఫ్యామిలీ నుంచి నటులు, నిర్మాతలు, దర్శకులు,రాజకీయ నాయకులు ఇలా ఎంతో మంది సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నారు. నందమూరి నటవారసులుగా.. బాలకృష్ణ.. ఆతరువాత ఎన్టీఆర్ పెద్దాయన పేరును నిలబెడుతున్నారు.
ఇక ఇప్పుడు నందమూరి తారకరామారావు కుటుంబం నుంచి మరో నట వారసుడు వచ్చేస్తున్నాడు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ ఇటీవల బసవతారకరామ క్రియేషన్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఇప్పుడీ సంస్థ.. జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ హీరోగా ఓ సినిమాను రూపొందిస్తోంది. ఈ బ్యానర్ నుంచి ప్రొడక్షన్ నంబర్ 1గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా బాలకృష్ణ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ.. బసవతారకరామ క్రియేషన్స్ నుంచి తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తుండడం ఆనందంగా ఉందన్నారు. సరికొత్త కథతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రక్ష, జక్కన్న ఫేం దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్టు జయకృష్ణ తెలిపారు.
ఇక శనివారం బసవతారకరామ బ్యానర్, తొలి చిత్రం ఫస్ట్ లుక్‌ను నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేసి, మాట్లాడారు. మా అమ్మ, నాన్నగార్ల పేర్లు కలిసొచ్చేలా బసవతారకరామ అని బ్యానర్‌కు పేరు పెట్టడం సంతోషంగా ఉంది. ఇది మా అన్నదమ్ములందరి బ్యానర్. నాన్నగారికి ఎంతో ఇష్టమైన చైతన్య ఈ బ్యానర్‌లోని సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు. అన్నయ్య జయకృష్ణ, డైరెక్టర్ వంశీకి ఆల్ ది బెస్ట్ చెప్పారు బాలయ్య. డిఫరెంట్ కాన్సెప్‌తో ఈ సినిమా రూపొందుతోంది అన్నారు జయకృష్ణ. మా నాన్నగారు స్థాపించిన బసవతారకరామ క్రియేషన్స్ ను బాబాయ్ బాలకృష్ణగారు లాంచ్ చేసి, ఆశీస్సులు అందించడం హ్యాపీగా ఉంది అన్నారు చైతన్య కృష్ణ.
