Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్‌.. నిజం ఏంటంటే?

చంద్రబాబు నాయుడు రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ కి ఆహ్వానం అందిందనే వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఏంటంటే?
 

ntr getting invitation to attend Chandrababu naidu take oath As CM what true arj
Author
First Published Jun 11, 2024, 9:18 PM IST

ఆంధ్ర ప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం రేపు(బుధవారం) కొలువు తీరబోతుంది. ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం రేపు ప్రమాణ స్వీకారం చేయబోతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోడీ, అమిత్‌ షా వంటి పలువురు దేశ నాయకులు ఈ ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొనబోతున్నారు. అందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఇక ఏపీ సీఎం ప్రమాణ స్వీకారం, ప్రభుత్వం ఏర్పాటు కార్యక్రమానికి సినిమా పరిశ్రమ నుంచి కూడా పలువురుకి ఆహ్వానాలు అందినట్టు తెలుస్తుంది. అందులో మెగాస్టార్‌ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది. విశిష్ట అతిథిగా ఆయన్ని చంద్రబాబు ఆహ్వానించారు. ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి సతీసమేతంగా ఏపీకి చేరుకున్నారు చిరంజీవి. తన భార్య సురేఖ, కూతురు శ్రీజ, ఆమె ఇద్దరు కూతుళ్లు చిరంజీవితోపాటు వెళ్లారు.

ఇక ఎన్టీఆర్‌ కి కూడా ఆహ్వానం అందిందనే వార్తలు వస్తున్నాయి. రేపటి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నుంచి జూ ఎన్టీఆర్‌కి ఆహ్వానం అందిందనే ప్రచారం జరిగింది. `దేవర` షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల తారక్‌ ఈ కార్యక్రమానికి అటెండ్‌ కావడం లేదనే వార్తలొచ్చాయి. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు అసలు ఎన్టీఆర్‌కి ఆహ్వానం అందలేదట. ఎలాంటి ఆహ్వానం రాలేదని తెలుస్తుంది. ఆహ్వానించారనే వార్తల్లో నిజం లేదని, కేవలం పుకార్లు మాత్రమే అని తెలుస్తుంది. కొన్ని సోషల్‌ మీడియా హ్యాండిల్స్, వెబ్‌ సైట్స్ సృష్టించిన పుకార్లు మాత్రమే అని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే చంద్రబాబుకి ఎన్టీఆర్‌కి మధ్య కొంత గ్యాప్‌ వచ్చినట్టు చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. తారక్‌ని చంద్రబాబు దూరం పెట్టారని అంటున్నారు. బాబాయ్‌ బాలయ్యతోనూ విభేదాలు నెలకొన్నాయని, నారా, నందమూరి ఫ్యామిలీలతో ఎన్టీఆర్‌కి కొంత గ్యాప్‌ నెలకొందనే ప్రచారం చాలా కాలంగా జరుగుతుంది. చంద్రబాబు అరెస్ట్ పై తారక్‌ స్పందించకపోవడం ఈ వివాదానికి ఆజ్యం పోసిందని అంటున్నారు. అంతకు ముందే కొన్ని వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని, చంద్రబాబు అరెస్ట్ తర్వాత అది మరింత పెరిగిందనే రూమర్స్ వచ్చాయి. అందుకే ఎన్టీఆర్‌ దూరంగా ఉంటున్నాడు, ఆయన్ని టీడీపీ శ్రేణులు దూరం పెడుతున్నాయని సోషల్‌ మీడియాలో వార్తలొచ్చాయి. కొంత ట్రోల్స్ కూడా జరిగిన విషయం తెలిసిందే. 

అయితే ఇటీవల ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఎన్టీఆర్‌ స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయన అభినందనలు తెలిపారు. మామయ్య అంటూ చంద్రబాబుకి విషెస్‌ తెలిపారు. లోకేష్‌కి, పురంధేశ్వరి, పవన్‌ కళ్యాణ్‌, మోడీలకు ఆయన అభినందనలు తెలిపారు. దీంతో వీరి మధ్య నెలకొన్న వివాదం సమసి పోయిందని అంతా భావిస్తున్నారు. మరి అది ఎంత వరకు జరుగుతుందనేది మున్ముందు తేలనుంది. 

ఇక ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర` సినిమాలో నటిస్తున్నారు. ఇది గోవా సమీపంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. గత కొన్ని రోజులుగా ఇక్కడే షూట్‌ చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ కూడా పాల్గొంటున్నారు. ఆయనతోపాటు కీలక పాత్రల్లో నటిస్తున్న నటులు కూడా ఉంటారని, ఓ పాటని చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. భారీ బడ్జెట్ తో పాన్‌ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇందులో సైఫ్‌ అలీ ఖాన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 10న ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios