దాదాపు 5నెలల నిరీక్షణకు మరో కొన్ని గంటల్లో తెరపడనుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ టీజర్ సిద్ధం అయ్యింది. నేడు ఉదయం 11:00 గంటలకు టీజర్ విడుదల కానుంది. రామరాజు ఫర్ కొమరం భీమ్ పేరుతో విడుదల రానున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 

 రెండేళ్లుగా ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అనుకోని కారణాల చేత ఈ ఏడాది జులైలో  విడుదల కావాల్సిన ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేశారు. కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వలన ఆరు నెలలకు పైగా షూటింగ్ కి బ్రేక్ పడింది. దీనితో 2021 జనవరికి రావలసిన ఆర్ ఆర్ ఆర్ మరలా వెనక్కి వెళ్ళింది. సినిమా విడుదల అటుంచితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్న ఫస్ట్ లుక్ టీజర్ కూడా రాజమౌళి విడుదల చేయలేదు. 

ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా మే నెలలో విడుదల కావాల్సిన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్ ని రాజమౌళి కావలసిన మెటీరియల్ లేదని, లాక్ డౌన్ వలన షూటింగ్ కూడా జరపలేము అని వాయిదా వేశారు. ఐతే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తిరిగి మొదలైన వెంటనే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేస్తాం అని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పునఃప్రారంభం కాగానే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోపై అప్డేట్ ఇచ్చాడు. నేడు కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ని రాజమౌళి పరిచయం చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో నిన్నటి నుండే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి మొదలుపెట్టేశారు. ఈ టీజర్ కి సంబంధించిన సోషల్ మీడియా ట్యాగ్స్ ట్రెండ్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇక కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో ద్వారా అనేక సోషల్ మీడియా రికార్డ్స్ నెలకొల్పాలని వీరు టార్గెట్ గా పెట్టుకున్నారు. వరల్డ్ వైడ్ గా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ సరికొత్త రికార్డ్స్ నెలకొల్పడం ఖాయం అన్నమాట వినిపిస్తుంది.