సాగర తీరానికి పయనమైన దేవర!
దేవర లేటెస్ట్ షెడ్యూల్ కి సంబంధించి కీలక సమాచారం అందుతుంది. యూనిట్ అవుట్ డోర్ షూటింగ్ కి వెళుతున్నట్లు టాలీవుడ్ టాక్.

దేవర షూటింగ్ అనుకున్న సమయానికి మొదలుకాలేదు. ఈ క్రమంలో దర్శకుడు కొరటాల శివ చెప్పిన తేదీకి సినిమా విడుదల చేయాలని నిరవధిక షూటింగ్ చేస్తున్నారు. గత ఏడు నెలలుగా నిరవధికంగా షూటింగ్ జరుగుతుంది. హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్స్ లో చాలా షూటింగ్ పూర్తి చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ అవుట్ డోర్ ప్లాన్ చేశారు. చిత్రీకరణ మొదలయ్యాక మొదటిసారి యూనిట్ అవుట్ డోర్ వెళుతున్నారు.
సముద్రంలో జరిగే ఫైట్స్ కూడా సెట్స్ లో పూర్తి చేశారు. అయితే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణకు రియల్ లొకేషన్స్ ఎంచుకున్నారు. దీనిలో భాగంగా గోవా వెళుతున్నట్లు సమాచారం. అక్కడ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. అనంతరం వైజాగ్, గోకర్ణ తీర ప్రాంతంలో షూటింగ్ జరుపుతారట. ఈ ఏడాది చివరి కల్లా షూటింగ్ పూర్తి చేయాలనేది టార్గెట్.
దేవర విఎఫ్ఎక్స్ కి చాలా సమయం పడుతుందట. గ్రాఫిక్స్ కి భారీగా ఖర్చు చేస్తున్నారట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కాకుండా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయాలనేది యూనిట్ భావన. 2024 ఏప్రిల్ 5 విడుదల తేదీగా ఇప్పటికే ప్రకటించారు. ఆ తేదీకి వచ్చేలా కొరటాల శ్రమిస్తున్నాడు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని సమాచారం. మరో పాత్రకు హీరోయిన్ గా ప్రియమణిని తీసుకున్నారట.
ఇక జాన్వీ కపూర్ దేవర చిత్రంతో సౌత్ ఇండియాలో అడుగుపెట్టింది. ఆమె పాత్ర కథలో కీలకంగా ఉంటుందని అంటున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, సుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.