రాజకీయ రంగ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ అలాంటి ఆలోచన ప్రస్తుతానికి లేదని కొట్టిపారేసిన ఎన్టీఆర్ కానీ హరికృష్ణ సారథ్యంలో అన్న టీడీపీతో రంగంలోకి దిగాలని ప్లాన్స్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగునాట ఎంతటి ఫాలోయింగ్ వుందో తెలిసిందే. తాతకు తగ్గ మనవడిగా ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్థుతం సినిమాల్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సాధించి.. తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటున్నారు. మాస్ ఫాలోయింగ్ లో పవన్ కళ్యాణ్ తో పోటీపడగలిగినంత సత్తా వున్న తారక్ గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా వున్న సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందు ఎన్నికల్లో తారక్ ప్రచారం మూలంగానే తెలుగుదేశం సీట్ల సంఖ్య పెరిగిందనే టాక్ వుంది.
అలాంటి ఎన్టీఆర్ మరోసారి తన రాజకీయరంగ ప్రవేశంపై స్పందించారు. జై లవ కుశ సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ రాజకీయాల్లోకి వస్తాడా అనే ప్రస్తావన వచ్చింది. దీంతో తన రాజకీయరంగ ప్రవేశానికి సంబంధించిన ప్రశ్నపై తారక్ స్పందిస్తూ.. "రాజకీయాల్లోకి వస్తానా రానా అనే అంశంపై తనకే ఇంకా ఓ క్లారిటీ లేనప్పుడు దానిపై తాను ఎలా స్పందించగలను" అని అన్నాడు.
''తాను గతంలోనూ ఇదే సమాధానం చెప్పాను. ఇప్పుడు కూడా అదే సమాధానం చెబుతున్నాను. ఏ విషయంపైనైనా స్పందించేటప్పుడు పూర్తి స్పష్టతతో మాట్లాడితేనే బాగుంటుంది అనేది తన ఉద్దేశం'' అని సమాధానం ఇచ్చి అసలు సమాధానం కోసం ఎదురుచూస్తున్న వారిని మళ్లీ సస్పెన్స్‌లోనే పెట్టాడు తారక్. అయితే... పక్కా ప్రణాళికతో.. అన్న తెలుగుదేశం పార్టీని మళ్లీ పునరుద్ధరించాలనే ప్లాన్ అంతర్గతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి హరికృష్ణ ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారో.. జూనియర్ ఎన్టీఆర్ ఏ రకంగా పార్టీని నడిపిస్తారోననే ఆసక్తి సర్వత్రా నెలకొని వుంది. కొంత సమయం తీసుకున్నా పక్కాగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.
