ఎన్టీ రామారావు, చిరంజీవి, రజనీకాంత్ వంటి హీరోలు సూపర్ స్టార్లు కావడానికి అమితాబ్ బచ్చనే సినిమాలే కారణమని తెలుగు స్టార్ డైరెక్టర్ కామెంట్ చేశారు.
సినిమాని కమర్షియల్ బాట పట్టించిన ఎన్టీరామారావు, చిరంజీవి
ఎన్టీ రామారావు, చిరంజీవి తెలుగు సినిమాని శాసించిన హీరోలు. తెలుగు సినిమా దశ దిశని మార్చిన హీరోలు. రామారావు పౌరాణిక చిత్రాలతోపాటు కమర్షియల్ చిత్రాలను కూడా చేసి బాక్సాఫీసుని షేక్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి రామారావు పంథాని ఫాలో అయ్యారు.
తెలుగు సినిమాని పూర్తిగా కమర్షియలైజ్ చేశారు. యాక్షన్ సీన్లు, పాటలు, మసాలా సాంగ్స్, కామెడీ, పవర్‌ఫుల్ డైలాగ్‌లతో రచ్చ చేశారు. ఆయన సినిమాలు చూసేందుకు ఆడియెన్స్ క్యూ కట్టేవారు.

మాస్ మసాలా చిత్రాలతో సూపర్‌స్టార్‌గా రజనీకాంత్
ఇక తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌సైతం మాస్ ఎలిమెంట్లతో సినిమాలు చేసి రాణించారు. సూపర్ స్టార్‌గా ఎదిగారు. కమల్ హాసన్ ప్రయోగాత్మక, విభిన్నమైన సినిమాలతో రాణించగా, రజనీ మాత్రం కమర్షియల్ చిత్రాలతోనే స్టార్‌గా ఎదిగారు. ఇప్పటికీ తిరుగులేని సూపర్ స్టార్‌గా రాణిస్తున్నారు.

రామారావు, చిరంజీవి, రజనీకాంత్‌లపై వర్మ కామెంట్స్
అయితే వీరంతా హీరోలుగా నిలబడానికి, సూపర్ స్టార్లుగా ఎదగడానికి అమితాబ్ బచ్చన్ కారణమట. బిగ్ బీ సినిమాలను రీమేక్ చేసి సూపర్ స్టార్లు అయ్యారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశారు. ఆర్జీవీ ఇటీవల భారతీయ సినిమా పరిశ్రమలో రీమేక్‌ల ప్రభావం గురించి మాట్లాడారు.
70ల, 80ల దశకాల్లో దక్షిణ భారత సినీ పరిశ్రమలు అమితాబ్ బచ్చన్ నటించిన హిందీ సినిమాలను రీమేక్ చేశాయని, రజనీకాంత్, చిరంజీవి, ఎన్టీ రామారావు, రాజ్‌కుమార్ వంటి సూపర్‌స్టార్లను తయారు చేశాయని ఆయన అన్నారు.
ఈ రీమేక్‌ల ద్వారా వారి సినిమాలు విశేష ప్రేక్షకాదరణ పొందాయని, ఆయా హీరోలను సూపర్ స్టార్లని చేశాయని తెలిపారు. అప్పటి దక్షిణ సినీ పరిశ్రమలు బచ్చన్ సినిమాలను ఆధారంగా తీసుకుని మసాలా సినిమాలను రూపొందించాయని పేర్కొన్నారు.

తెలుగు సినిమాని ఆకాశానికి ఎత్తిన ఆర్జీవీ
బాలీవుడ్ దర్శకులు విదేశీ సినిమా ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యారని, వారి పెరుగుదలలో ఇది ముఖ్య పాత్ర పోషించిందని వర్మ అభిప్రాయపడ్డారు. సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ మాత్రం తమ సంస్కృతి, భాషలతో బలంగా అనుసంధానమై ఉన్నారని, వారు మాస్ ప్రేక్షకులతో బలమైన అనుబంధం కలిగి ఉన్నారని వర్మ చెప్పారు.
`పుష్ప: ది రైజ్` సినిమాపై ప్రముఖ బాలీవుడ్ నిర్మాత చేసిన వ్యాఖ్యలను వర్మ గుర్తు చేశారు. ఆ నిర్మాత, `ఈ వ్యక్తి ముఖాన్ని చూసి ఉత్తర భారత ప్రేక్షకులు వాంతులు చేసుకుంటారు` అని వ్యాఖ్యానించారని, ఇది అల్లు అర్జున్ ని వ్యక్తిగతంగా కాకుండా, పాత్రపై చేసిన వ్యాఖ్య అని వర్మ తెలిపారు.
అయితే, `పుష్ప`, `పుష్ప 2` సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ.2000 కోట్లకు పైగా వసూలు చేశాయని, ఆ నిర్మాత డ్రీమ్స్ లో బతుకుతున్నాడని తెలిపారు.

బాలీవుడ్ దర్శకులు `పుష్ప` వంటి సినిమాలను రూపొందించలేరని, ఎందుకంటే వారి భావోద్వేగాలు, సున్నితత్వాలు అలాంటి కథలకు అనుకూలంగా లేవని, దక్షిణ భారత దర్శకులు తమ భాష, సంస్కృతి, ప్రజలతో బలమైన రిలేషన్ కలిగి ఉన్నారని, వారు మాస్ ప్రేక్షకుల నాడీని పట్టుకుని సినిమాలు చేస్తారని వెల్లడించారు.
ప్రస్తుతం వర్మ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. అయితే ఇందులో సౌత్ సినిమాలను పొగుడుతూనే, చిరంజీవి, రామారావు, రజనీకాంత్‌లను తక్కువ చేసి మాట్లాడటం పట్ల వారి అభిమానులు వర్మపై ఫైర్ అవుతున్నారు.
