స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా చలనచిత్రం త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించిన బాలకృష్ణ ప్రస్థుతం దర్శకుడు తేజ స్క్రిప్ట్ వర్క్ లో బిజీ బిజీ ఈ మూవీలో మోక్షజ్ఞ ముఖ్య పాత్రలో నటిస్తారని సమాచారం

తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు సంబంధించి ప్ర‌స్తుతం ఓ టాలీవుడ్‌ బ‌యోపిక్‌పై పెద్ద చ‌ర్చ న‌డుస్తోంది. మహా నటులు, భారత రత్నార్హులు, మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించబోయే బయోపిక్ గురించే ఆ చర్చ. ఇందులో రెండు రకాలు. తెలుగుదేశం పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా ప్రజారంజక పాలన అందించి తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోయిన ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌పై ఆయ‌న త‌న‌యుడు బాల‌య్య హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా వ‌స్తుంటే, సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అయిన వివాదాల ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా మ‌రొక‌టి.

బాల‌య్య - తేజ కాంబోలో వ‌స్తోన్న సినిమా ఎన్టీఆర్ బాల్యం, సినిమాలు, పొలిటిక‌ల్ ఎంట్రీ, టీడీపీలో నాదెండ్ల సంక్షోభం, ఎన్టీఆర్ ప్ర‌భుత్వం కూలిపోవ‌డం, తిరిగి ఎన్టీఆర్ ఎన్నిక‌ల‌కు వెళ్లి ఇందిరాగాంధీకి స‌వాల్ విసిరేలా ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించేవ‌ర‌కు ఉంటుంది. ఇక అటు రాంగోపాల్ వ‌ర్మ అయితే ఎన్టీఆర్ జీవితాన్ని ల‌క్ష్మీపార్వ‌తి కోణంలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ టైటిల్‌తో తెర‌కెక్కిస్తోన్న‌ సంగ‌తి తెలిసిందే.

ఈ రెండు సినిమాలపై అటు సినిమా వ‌ర్గాల‌తో పాటు ఇటు రాజ‌కీయ‌వ‌ర్గాల్లోను ఆస‌క్తిక‌ర చర్చ న‌డుస్తుండ‌గానే బాల‌య్య – తేజ కాంబినేషన్ లో.. వ‌స్తోన్న బ‌యోపిక్ రిలీజ్ డేట్‌పై అప్పుడే ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. బాల‌య్య త‌న తాజా ఇంట‌ర్వ్యూలో ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ప్ర‌క‌ట‌న చేసేశారు. వ‌చ్చే యేడాది మే 28న ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంద‌ని చెప్పారు. ఈ సినిమాను హీరో బాలకృష్ణ తో సహా సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ద‌ర్శ‌కుడు తేజ ప్రస్తుతం స్క్రిఫ్ట్ వ‌ర్క్ లో బిజీగా ఉన్నాడు.