ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా తెలుగులో భారీ మల్టీస్టారర్‌ `ఆర్‌ ఆర్‌ ఆర్‌` రూపొందుతుంది. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దీన్ని రూపొందిస్తున్నారు. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. లాక్‌డౌన్‌కి ముందే 70శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. లాక్‌ డౌన్‌ తర్వాత షూటింగ్‌ ప్రారంభించి శరవేగంగా చిత్రీకరణ జరిపారు. ఇక చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ విషయాన్ని రాజమౌళి అధికారికంగా ప్రకటించారు.ఎన్టీఆర్‌ సైతం సూపర్‌ ఎగ్జైటింగ్‌గా ఉందంటూ ట్వీట్‌ చేశారు. 

`క్లైమాక్స్ షూటింగ్‌ ప్రారంభమైంది. నా రామరాజు, కొమురంభీమ్‌ కలిశారు. వాళ్లు కోరుకున్నది సాధించేందుకు కలిశారు` అని పేర్కొన్నారు రాజమౌళి. అప్పటి వరకు ఎవరికి వారు పోరాడిన ఈ యోధులు, ఇప్పుడు కలిసి ప్రత్యర్థులపై పోరాడుతున్నట్టు చెప్పకనే చెప్పారు రాజమౌళి. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. చరణ్‌ సరసన సీత పాత్రలో బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియా భట్‌ నటిస్తుంది. అలాగే ఎన్టీఆర్‌ సరసన బ్రిటీష్‌ హీరోయిన్‌ ఒలివీయా మోర్రీస్‌ నటిస్తుంది. అజయ్ దేవగన్‌, సముద్రఖని, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ఇప్పటికే విడుదలైన రామరాజు టీజర్‌, కొమురంభీమ్ పాత్ర టీజర్లు విశేషంగా ఆకట్టుకోవడంతోపాటు రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోయాయి. పాన్‌ ఇండియా సినిమాగా ఇది రూపొందుతున్న విషయం తెలిసిందే. దాదాపు పది భాషల్లో సమ్మర్‌లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.