టెంపర్ నుండి హిట్ ట్రాక్ మైంటైన్ చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ తో బాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న ఆయన, ఆ తదుపరి దర్శకుడు త్రివిక్రంతో తన 30వ చిత్రం చేయనున్నారు. ఆర్ ఆర్ ఆర్ మరియు త్రివిక్రమ్ మూవీ ఏక కాలంలో పూర్తి చేయాలని ఎన్టీఆర్ భావించారు. ఐతే లాక్ డౌన్ కారణంగా అది కుదరలేదు. దీనితో  త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్ళేది ఆర్ ఆర్ ఆర్ పూర్తి అయిన తరువాత మాత్రమే. దీనితో ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ మరింత లేటయ్యేలా కనిపిస్తుంది.

 కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఓ మూవీ చేయనున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ పరోక్షంగా దర్శకుడు మరియు నిర్మాతలు తెలియజేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆర్ ఆర్ ఆర్ మరియు త్రివిక్రమ్ మూవీ 2020 చివరికల్లా పూర్తి చేసి 2021 సమ్మర్ తరువాత ప్రశాంత్ నీల్ మూవీ షూట్ లో పాల్గొనాలనేది ఎన్టీఆర్ ప్రణాళిక. దర్శకుడు ప్రశాంత్ నీల్ సైతం కెజిఎఫ్ 2 నుండి అక్టోబర్ కల్లా బయటికి రావాల్సివుంది. కొంచెం అటో ఇటుగా ప్రశాంత్ కెజిఎఫ్ 2 పూర్తి చేసి ఎన్టీఆర్ మూవీకి సిద్ధం కానున్నాడు. 

ఐతే ఆర్ ఆర్ ఆర్ తో పాటు, త్రివిక్రమ్ మూవీకి కమిటై ఉన్న ఎన్టీఆర్ వాటిని పూర్తి చేయడానికి 2021చివరి వరకు సమయం తీసుకోవచ్చు. కాబట్టి ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ పట్టాలెక్కేది 2022లోనే అనేది అందరి అంచనా. ఈ నేపథ్యంలో ప్రశాంత్ మరో చిత్రాన్ని ఒప్పుకొనే ఆస్కారం లేకపోలేదు. కెజిఎఫ్ తరువాత ప్రశాంత్ నీల్ ఇమేజ్ అమాంతంగా పెరిగిపోగా,  ఎన్టీఆర్ తో ఆయన చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.