తాము పనిచేస్తున్న హీరో సినిమా పెద్ద హిట్ అయితే ...ఆ టీమ్ సంతోషం ఇంత అని చెప్పలేం. ఎందుకంటే ఆ సినిమా పేరు చెప్పి తమ సినిమా బిజినెస్ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. క్రేజ్ వస్తుంది. అదిరిపోయే ఓపినింగ్స్ ఉంటాయి. దాంతో వెంటనే బిజినెస్ క్లోజ్ చేసి, రిలీజ్ కు పెట్టేస్తారు. కానీ అదేం విచిత్రమో...క్రిష్, వైష్ణవ్ తేజ్ సినిమా మాటా ఎక్కడా వినపడటం లేదు. ఉప్పెన’ సినిమా విడుదలయి 50 రోజులు పూర్తి అయింది. ఈ మూవీ ఈ నెల 14న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ఈ సినిమా ద్వారా పరిచయమైన వైష్ణవ్ తేజ్ మూడో సినిమా ప్రారంభమైంది. కానీ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న రెండో సినిమా గురించి ఏ అప్ డేటూ రావటం లేదు.

నిజానికి గత సంవత్సరం  సెప్టెంబర్ లో క్రిష్ వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా ఒక సినిమా ప్రారంభించాడు. డిసెంబర్ లో షూటింగ్ పూర్తి చేశాడు. ‘ఉప్పెన’ రిజల్ట్ చూసి ఈ సినిమా పబ్లిసిటీ చేద్దామనుకున్నాడు. ‘ఉప్పెన’ బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ క్రిష్ మాత్రం ఆ మూవీ గురించి మాట్లాడటం లేదు. షూటింగ్‌ ప్యాచ్‌ వర్క్‌ మినహా మొత్తం పూర్తి అయ్యింది.

కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కు పూర్తిగా దూరంగా ఉండే ఈ సినిమా ను క్రిష్‌ ఎప్పుడు విడుదల చేస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది కనుక సినిమాను రాబోయే రెండు నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. కాని ఊహించని విధంగా క్రిష్‌ ఈ సినిమా ను ఏకంగా ఆగస్టు వరకు వాయిదా వేస్తూ వస్తాడని తెలుస్తోంది.ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో క్రిష్ చెప్పాడట. 

ఈ సినిమాకి గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా ఉంది. అది కూడా పూర్తి కావాలి. అందుకే టైం పడుతోంది అని వినపడుతోంది. అంతేకాకుండా ఈ సినిమా... ఉప్పెన సినిమాకు పూర్తి విరుద్దంగా వైవిధ్యభరితంగా ఈ సినిమా ఉంటుంది. కనుక వెంటనే ఈ సినిమా విడుదల చేస్తే ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోవచ్చు అంటూ క్రిష్ కొండ పొలంను వాయిదా వేస్తూ వస్తున్నారు అని మరికొందరు అంటున్నారు. ఏది నిజమో కానీ...అభిమానులు మాత్రం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనేది మాత్రం నిజం. 

ఈ మూవీకి తానా అవార్డ్.. 2లక్షల బహుమతి గెలుచుకున్న `కొండ పొలం` అనే నవల మూలం అని తెలిసింది. పోడు వ్యవసాయం లో అడవి జంతువులు తిరగాడే చోట నీళ్లు లేని కారడవిలో రైతు జీవనంపై సినిమా. సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి నవల ఇది. హక్కులు కొనుక్కుని సినిమాటిక్ గా మార్చారట. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ -రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్నారు. క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరి హర వీరమల్లు’ సినిమా తీస్తున్నాడు. ఈ షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు.