Rajamouli, Mahesh : టిక్కెట్ రేట్ల కొత్త జీవో పై రాజమౌళి, మహేష్, చరణ్ ఎందుకు సైలెంట్ ?కారణం ఏంటో
చిరంజీవి, ప్రభాస్ తప్పించి ఎవరూ ఈ విషయమై స్పందించకపోవటం ఆశ్చర్యం కలిగించింది. చిరంజీవి, రామ్ చరణ్, రాజమౌళి వంటి వారు ఈ విషయమై పెదవి విప్పలేదు. అప్పుడు టిక్కెట్లు కోసం కదిలిన వీరంతా ఇలా సైలెంట్ అయ్యిపోవటం పెద్ద డిస్కషన్ కు దారి తీస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ...తెలుగు చలన చిత్ర పరిశ్రమకు, థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లకు శుభవార్త అందించింది. సినిమా టికెట్(Cinema ticket rates) ధరలు పెంచుతూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ల రేట్లు కనిష్టంగా రూ.20, గరిష్ఠంగా 250 నిర్ణయించింది. ఏరియాను బట్టి థియేటర్లను నాలుగు రకాలుగా విభజించి ధరలను పెంచింది. ఈ రేట్లకు జీఎస్టీ అదనం. ఇక ఈ టిక్కెట్ల రేట్లు ప్రకటన రాగానే వరస పెట్టి సినీ పరిశ్రమ నుంచి అభినందనల వర్షం కురుస్తుందని అందరూ భావించారు. అయితే చిరంజీవి, ప్రభాస్ తప్పించి ఎవరూ ఈ విషయమై స్పందించకపోవటం ఆశ్చర్యం కలిగించింది. చిరంజీవి, రామ్ చరణ్, రాజమౌళి వంటి వారు ఈ విషయమై పెదవి విప్పలేదు. అప్పుడు టిక్కెట్లు కోసం కదిలిన వీరంతా ఇలా సైలెంట్ అయ్యిపోవటం పెద్ద డిస్కషన్ కు దారి తీస్తోంది. మరో ప్రక్క వైసీపీ మీడియా...సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ జీవో తో ఆనందంలో తేలుతున్నట్లు వార్తలు ఇస్తోంది. అయితే సినిమా పెద్దలకు ఈ జీవో నచ్చలేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇరవై శాతం షూటింగ్ లు ఏపిలో చేయటం అనే కండీషన్ కు చాలా మంది సముఖంగా లేరని అంటున్నారు.
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ప్రముఖ నటుడు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి పేర్నినాని, అధికారులు, కమిటీకి చిత్ర పరిశ్రమ తరుఫున కృతజ్ఞతలు తెలిపారు. ‘‘తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగేలా థియేటర్ల మనుగడను, ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని, సినిమా టికెట్ రేట్లు సవరిస్తూ జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గారికి కృతజ్ఞతలు. చిన్న సినిమాకు ఐదో షో అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం’’ అని ట్వీట్ చేశారు.
జీవో నెంబర్ 13 పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ విశ్వజిత్ కొత్త జీవో జారీ చేశారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సినీ పరిశ్రమ కోరిన అన్ని అంశాల మీద సానుకూలంగానే స్పందించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా కొన్ని కండిషన్లు కూడా పెట్టింది.
ఆంధ్రప్రదేశ్ జీఓ నెంబర్ 13 ప్రకారం థియేటర్ ప్రాంతాలను మూడు రకాలుగా విభజించారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అలాగే నగర పంచాయతీ -గ్రామ పంచాయతీ అనే మూడు కేటగిరీలుగా విభజించారు. వాటిలో మళ్ళీ నాన్ ఏసీ నాన్ ప్రీమియం-ప్రీమియం, ఏసీ నాన్ ప్రీమియం-ప్రీమియం, స్పెషల్ థియేటర్స్ నాన్ ప్రీమియం-ప్రీమియం, మల్టీప్లెక్స్ రెగ్యులర్ సీట్లు- రిక్లైనర్లు అంటూ విభజించారు. వీటిలో మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రారంభ ధర 40 రూపాయలు ఉండగా చివరి ధర 250 రూపాయలు. మున్సిపాలిటీలో ప్రారంభ ధర 30 రూపాయలు ఉండగా చివరి ధర 250 రూపాయలు ఉంది. నగర పంచాయతీలు- గ్రామపంచాయతీల విషయానికి వస్తే ప్రారంభ ధర 20 రూపాయలు ఉండగా చివరి ధర 250 రూపాయలు వసూలు చేసుకునే అవకాశం కల్పించారు.
అలాగే ప్రతి థియేటర్ లో పాతికశాతం సీట్లు నాన్ ప్రీమియం కేటగిరీ కింద కచ్చితంగా ఉండాల్సిందేనని పేర్కొన్నారు. థియేటర్లలో రోజుకు ఐదు షోలు వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తూనే అందులో ఒక షో చిన్న సినిమా వేయాల్సిందేనని పేర్కొన్నారు. పండుగపూట అయినా, పెద్ద సినిమా ఉన్నా చిన్న సినిమాను ఆడించాలని, చిన్న సినిమాలను ప్రోత్సహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల లోపు ఏదో ఒక షోలో చిన్న సినిమా వేసి తీరాల్సిందేనని పేర్కొన్నారు. నటీనటులు రెమ్యూనరేషన్ తో కలిపి ఇరవై కోట్ల లోపు ఉన్న దాన్ని చిన్న సినిమాగా పరిగణించాలని పేర్కొన్నారు.
ఇక గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సూచనల ప్రకారం కొన్ని హై బడ్జెట్ సినిమాలకు రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తున్నామని పేర్కొన్నారు. క్రియేటివిటీ ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్, హైడ్ అండ్ టెక్నాలజీ వాడిన హై బడ్జెట్ సినిమాలకు కచ్చితంగా భారీ బడ్జెట్ అవుతుంది కాబట్టి వాటిని స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఏ సినిమా అయితే నటీనటుల రెమ్యూనరేషన్, దర్శకుల రెమ్యూనరేషన్ కాకుండా వందకోట్ల రూపాయలు దాటుతుందో అలాంటి సినిమాను విడుదల చేసిన తర్వాత పది రోజుల పాటు సవరించిన రేట్లు ప్రభుత్వం ప్రకటిస్తుందని పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఒక కండిషన్ విధించారు. సదరు సినిమా 20 శాతం షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లో చేయాలని పేర్కొన్నారు. చిన్న సినిమాలకు ఐదు షోలు వేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త జీవో జారీతో గతంలో జారీ చేసిన జీవో నెంబర్ 35 రద్దు అయినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.