ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే దాన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలా అని తెగ ఆలోచిస్తుంటారు. వీలైనంతగా సినిమాను ప్రమోట్ చేసి రీచ్ పెంచుకొనే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాలను మన స్టార్లు లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, ఎఫ్2 లతో పాటు రజినీకాంత్ 'పేటా' కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. పేటా సినిమా పక్కన పెడితే మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

దాదాపు రూ.230 కోట్ల బడ్జెట్తో నిర్మాతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకొబోతున్నారు. కానీ ఇప్పటివరకుఈ నాలుగు సినిమాలకు సంబంధించి సరైన ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించలేదు. ఎన్టీఆర్ బయోపిక్ మొదటి నుండి పోస్టర్లు, టీజర్లు అంటూ సోషల్ మీడియాలో కాలం గడిపేస్తుంది. సినిమా ఆడియో లాంచ్ తో మంచి బజ్ క్రియేట్ అయినా.. బాలకృష్ణ, రానా వంటి నటులు మీడియా ముందుకొచ్చి మాట్లాడితే ఆ ప్రమోషన్స్ వేరే స్థాయిలో ఉంటాయి.

కానీ  చిత్రబృందం ఎందుకో ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. తమ అనుబంధ పత్రికలను పిలిచి ఇంటర్వ్యూలు ఇచ్చి 'మమ' అనిపించుకుంటారని టాక్. మరోపక్క 'వినయ విధేయ రామ', 'ఎఫ్2'  సినిమాల ప్రమోషన్స్ కూడా అలానే ఉన్నాయి. ఫెస్టివల్ సీజన్ కాబట్టికలెక్షన్లు వాటంతటవే వచ్చేస్తాయని మన స్టార్లు భావిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సినిమా ఏవరేజ్ గా ఉన్నా.. ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తే హిట్ టాక్ వస్తుంది. కానీ ఈసారి మన హీరోలు సైలెంట్ మోడ్ లో ఉన్నట్లు అనిపిస్తోంది. మరి దీని ఎఫెక్ట్ కలెక్షన్లపై పడుతుందేమో చూడాలి!