విజయ్‌ చాలా కాలంగా తమ సినిమాల ప్రమోషన్లకి దూరంగా ఉంటున్నారు. కనీసం సినిమా ఈవెంట్లకి కూడా రావడం లేదు.  మరి `వారసుడు` చిత్రం కోసం తన రూల్స్ బ్రేక్‌ చేస్తాడా? అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

దళపతి విజయ్‌ కోలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌ డమ్‌తో దూసుకుపోతున్నారు. జయాపజయాలకు అతీతంగా ఆయన్ని ప్రేమిస్తుంటారు అభిమానులు. ఆయన సినిమాలను అంతే రేంజ్‌లో ఆదరిస్తుంటారు. ఇక్కడ పవన్‌ ఎలాగో, అక్కడ విజయ్‌ అలాగ. అయితే చాలా కాలంగా తమ సినిమాల ప్రమోషన్లకి దూరంగా ఉంటున్నారు విజయ్‌. కనీసం సినిమా ఈవెంట్లకి కూడా రావడం లేదు. మీడియా ముందుకు రావడం లేదు. తాను రావద్దని నిబంధన పెట్టుకున్నారట. 

అందుకు కారణం ఇటీవల చెప్పారు. గతంలో ఓ మీడియా మీటింగ్‌లో పాల్గొనగా, తాను చెప్పిన విషయాలను తప్పుగా రాశారని, అది చూసి తన ఫ్యామిలీ, తాను షాక్‌ అయ్యాడట. తన ఫ్యామిలీకి చెప్పి కన్విన్స్ చేయగలిగాను. కానీ మిగిలిన అందరికి తాను చెప్పలేను కదా అని, అందుకే ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు తాను ప్రమోషన్స్ లో పాల్గొనని, మీడియా ముందుకు రానని తెలిపారు. అంతేకాదు ఈవెంట్లు చేయడం వల్ల ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశ్యంతో రావడం లేదన్నారు.

అయితే ఆ రూల్‌ని దాన్ని గత సినిమా నుంచి కొద్ది కొద్దిగా బ్రేక్‌ చేస్తున్నారు విజయ్. పూర్తిగా కాదుగానీ, ఏదో ఒక విషయంలో కన్విన్స్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత సినిమా `బీస్ట్` ప్రమోషన్స్ లో ఆయన పాల్గొన్నారు. దర్శకుడు, హీరోయిన్‌ పూజాలతో కలిసి ఆయన కారులో డ్రైవ్ చేస్తూ కనిపించారు. అలాగే ఓ టీవీ ఛానెల్‌కి దర్శకుడితో ఇంటర్వ్యూ ఇచ్చాడు. అంతేకాదు ఇప్పుడు ఆయన నటించిన `వారసుడు` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనూ పాల్గొన్నాడు విజయ్. ఫ్యాన్స్‌ ని అలరించారు. 

చూస్తుంటే క్రమంగా తాను పెట్టుకున్న నిబంధనలను బ్రేక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మరో పెద్ద ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం నటించిన `వారసుడు` చిత్రం సంక్రాంతికి తెలుగు, తమిళంలో విడుదల కానుంది. తెలుగు డైరెక్టర్‌ వంశీపైడిపల్లి దీనికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దిల్‌రాజు దీన్ని నిర్మించారు. అయితే తెలుగు స్టేట్స్ లో ఈ సినిమా ప్రమోషన్స్‌ లో విజయ్‌ పాల్గొంటాడా? అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. 

ఇప్పటి వరకు తెలుగులో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. నేడు శ్రీకాంత్‌ ఇంటర్వ్యూ పెట్టారు. అయితే అందరి అటెన్షన్‌ గ్రాస్ప్ చేయడానికి పెద్ద ఈవెంట్‌ లాంటిది పెట్టాలి. అది విజయ్‌ వస్తేనే సక్సెస్‌ అవుతుంది. లేదంటే యూస్‌లెస్. పవన్‌ గెస్ట్ గా ఈవెంట్‌ ని దిల్‌రాజు ప్లాన్‌ చేశారని గతంలో వార్తలొచ్చాయి. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు ఆ ఈవెంట్‌ ఉండబోదని టాక్‌. విజయ్‌ రాకపోవడం, పవన్‌ బిజీగా ఉన్న నేపథ్యంలో దిల్‌రాజు తన ఆలోచన విరమించుకున్నారని సమాచారం.

మొత్తానికి విజయ్‌ తమిళంలో తన ప్రమోషన్‌ రూల్‌ని కొద్దిగా బ్రేక్‌ చేసినా హైదరాబాద్‌కి వచ్చే అవకాశం లేదని టాక్‌. దీంతో దర్శకుడు వంశీపైడిపల్లి, హీరోయిన్‌ రష్మిక మందన్నా, కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్‌, నిర్మాత దిల్‌ రాజునే ఇక్కడ `వారసుడు`ని ప్రమోషన్‌ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమాకి తెలుగులో పెద్దగా బజ్‌ లేదు. దిల్‌రాజు వివాదాస్పద కామెంట్లు తప్ప సినిమాకి క్రేజ్‌ లేదు. దీనికితోడు ఇది `మహర్షి`కి సీక్వెల్ గా, ప్రీక్వెల్‌గా ఉంటుందని ప్రచారం కూడా సినిమాకి నెగటివ్‌గా మారింది. మరి దాన్ని దాటుకుని ఆడియెన్స్ లోకి ఎలా తీసుకెళ్తారనేది చూడాలి. కాకపోతే సినిమా పట్ల దిల్‌రాజు కాన్ఫిడెంట్‌గా ఉన్నారని టాక్.