'బాహుబలి' లాంటి భారీ బడ్జెట్ సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న చిత్రం 'సాహో'. దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో దర్శకుడు సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కుర్ర డైరెక్టర్, పైగా ఇంత భారీ బడ్జెట్ హ్యాండిల్ చేసిన అనుభవం లేదు. మేకింగ్ వీడియోలు ఓకే అనిపిస్తున్నా.. దర్శకుడిగా తన పనికి ఎంత న్యాయం చేశాడో.. సినిమా 
చూస్తే కానీ తెలియదు.

ఇక సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో కూడా సుజీత్ టీమ్ చాలా వీక్ గా ఉంది. నిజానికి 'బాహుబలి' సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో అసలు ప్రభాస్ జోక్యం చేసుకోలేదు. నటించడం తప్ప మిగిలినదంతా రాజమౌళి మీదే వదిలేశాడు. ఆ సినిమాకు అంత క్రేజ్ వచ్చిందంటే దానికి కారణం.. రాజమౌళి అండ్ టీమ్. మార్కెట్ 
చేయడం కొత్త స్ట్రాటజీలు ఫాలో అయ్యి ఇంటర్నేషనల్ వైడ్ సినిమాపై బజ్ పెంచేశారు.

కానీ 'సాహో' విషయంలో అలా జరగడం లేదు. సుజీత్ టీమ్ స్ట్రాంగ్ గా లేకపోవడంతో ప్రభాస్ కన్ఫ్యూజన్ లో పడిపోయాడు. సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో అర్ధం కాక టెన్షన్ పడుతున్నాడు. నిర్మాణ సంస్థ యువి క్రియేషన్ కి కూడా నేషనల్ మార్కెట్ ని టార్గెట్ చేసిన అనుభవం లేదు. 'సాహో' సినిమాను దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో పెట్టడానికి పలుమార్లు కృషి చేసినా కానీ ఏదీ వర్కవుట్ కావడం లేదు.

పైగా తాజాగా విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ సినిమాల నుండి పోస్టర్ కాపీ చేశారని, సినిమాను కూడా కాపీ చేసుంటారని సెటైర్లు వేస్తున్నారు. దీంతో ఇప్పుడు సినిమాకు క్రేజ్ ఎలా తీసుకురావాలో అర్ధంకాక సాహో టీమ్ తలలు పట్టుకుంది.