బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఇటీవల ఆమె నటించిన 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమాలో ఒక పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కంగనా ఓ జర్నలిస్ట్ పై మండిపడింది. తను నటించిన 'మణికర్ణిక' సినిమా గురించి జస్టిన్ రావు అనే జర్నలిస్ట్ తప్పుగా రాశాడని అతడిని టార్గెట్ చేస్తూ కంగనా కామెంట్స్ చేసింది.

అయితే అతడు మాత్రం కంగనా చేసే ఆరోపణల్లో నిజం లేదని ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశాడు. దీంతో విషయం కాస్త పెద్దదైంది. కంగనా క్షమాపణలు చెప్పాలని మీడియా సభ్యులు డిమాండ్ చేశారు. కానీ కంగనా సోదరి ఆమె మేనేజర్ అయిన రంగోలి క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో సదరు జర్నలిస్ట్ 'జడ్జిమెంటల్ హై క్యా' చిత్రనిర్మాత ఏక్తాకపూర్ కి ఓ లెటర్ రాశారు.

మీడియా సభ్యులంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చామని.. కంగనా గనుక క్షమాపణలు చెప్పకపోతే ఆమెని బాయ్కాట్ చేస్తామని.. ఆమెకి సంబంధించి మీడియాలో ఎలాంటి కవరేజ్ ఉండదని లెటర్ లో పేర్కొన్నారు. అయితే ఆ బాయ్కాట్ కేవలం కంగనా వరకే ఉంటుందని.. సినిమాపై ఎలాంటి ఎఫెక్ట్ చూపదని.. దీని కారణంగా ఇతర నటీనటులకు కూడా ఎలాంటి ఇబ్బందని కలగదని చెప్పారు.

అయినప్పటికీ కంగనా మాత్రం క్షమాపణలు చెప్పదని ఆమె సోదరి రంగోలి చెబుతోంది. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ కూడా పెట్టింది. కంగనా నుండి ఎలాంటి క్షమాపణలు రావని ప్రామిస్ చేస్తున్నట్లు చెప్పింది. ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.