నవంబర్ మాసం చిత్ర పరిశ్రమకు పెద్దగా కలసి రాదు. కొన్ని చిన్న చిత్రాలు మాత్రం నవంబర్ లో సందడి చేస్తాయి. సంక్రాంతికి విడుదల చేసేందుకు అవకాశం లేని సినిమాలని డిసెంబర్ లో క్రిస్టమస్ కానుకగా విడుదల చేస్తారు. సంక్రాంతి ఎలాగూ బాక్సాఫీస్ వద్ద బడా హీరోల సందడి ఉంటుంది. 

ఇదిలా ఉండగా యంగ్ హీరో నితిన్ నటించిన భీష్మ చిత్రాన్ని మొదటగా డిసెంబర్ లో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ సాయిధరమ్ తేజ్ ప్రతిరోజు పండగే, బాలయ్య రూలర్ లాంటి చిత్రాలు డిసెంబర్ లో పోటీ పడబోతున్నాయి. దీనితో అనవసరమైన పోటీ ఎందుకని భావించిన భీష్మ చిత్ర యూనిట్ తమ చిత్రాన్ని ఫిబ్రవరికి వాయిదా వేసుకుంది. 

భీష్మ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. పరిస్థితి చూస్తుంటే ఫిబ్రవరిలో కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ గట్టిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండదా నటిస్తున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రం కూడా రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. ఈ చిత్రాన్ని వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నారు. 

ఇక క్రేజీ హీరోయిన్ సమంత, శర్వానంద్ జంటగా నటిస్తున్న 96 రీమేక్ మూవీని కూడా ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు దిల్ రాజు సన్నాహకాలు చేస్తునట్లు తెలుస్తోంది. ఈ మూడు చిత్రాలపై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఉంది. దీనితో ఫిబ్రవరిలో బాక్సాఫీస్ సమరం రంజుగా ఉండబోతున్నట్లు ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. 

నితిన్, రష్మిక మందన జంటగా నటిస్తున్న భీష్మ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ ఎమోషనల్ ప్రేమకథతో రూపొందుతోంది. తమిళంలో ఘనవిజయం సాధించిన 96 చిత్ర రీమేక్ లో సమం, శర్వానంద్ నటిస్తున్నారు.