సినిమా పరిశ్రమలో ఇగోలు హర్ట్ చేయనంతసేపు అన్ని బాగానే ఉంటాయి. కానీ ఒక్కసారి ఎదుటివారిపై  నెగిటివ్ ఆలోచన వస్తే దాన్ని భరించలేరు. అందుకే హీరోలతో చాలా జాగ్రత్తగా ఉంటారు దర్శకులు. కానీ ఒక్కోసారి అత్యుత్సాహం కొంప ముంచుతుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో నితిన్ తో అనుకున్న  ప్రాజెక్టు అలాంటి సంఘటనతోనే ప్రక్కకు వెళ్లిపోయిందని ఫిల్మ్ నగర్ టాక్.

గత కొద్ది రోజులుగా నితిన్, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. నితిన్ సైతం ఆ కథ విని ఓకే చేసారట. బెల్లంకొండ శ్రీనివాస్ తో రమేష్ వర్మ అనుకున్న ప్రాజెక్టు కాన్సిల్ అయ్యిందని అందుకే నితిన్ తో సినిమా చేస్తున్నాడని మీడియా వర్గాలు అంది. అయితే నితిన్ ఇంకా చర్చల దశలోనే ఉన్న ఆ ప్రాజెక్టు ఫైనల్ అయ్యినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అవి నితిన్ దాకా చేరాయి. దాంతో నితిన్ ...రమేష్ వర్మపై మండిపడ్డారట.అక్కడితో ఆగకుండా తన సినిమాల గురించి స్వయంగా వెల్లడించేవరకూ ఎవ్వరి మాటలూ నమ్మొద్దని  ట్వీట్ చేసాడు.  

‘నేను చేయబోయే సినిమాల గురించి, అప్‌డేట్స్‌ గురించి నా అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా స్వయంగా ప్రకటిస్తాను. నా గురించి వచ్చే ఎలాంటి ఫేక్‌ వార్తలను నమ్మకండి. థాంక్యూ’ అని నితిన్‌ ట్వీట్‌ చేశారు. మరో ప్రక్క  నితిన్‌ తాజాగా  తన కొత్త సినిమాకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల నుంచే  షూటింగ్ మొదలు కాబోతోంది. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి స్వరాలు సమకూర్చబోతున్నారు.