Asianet News TeluguAsianet News Telugu

నితిన్ చల్ మోహన రంగ మూవీ రివ్యూ

చల్ మోహన రంగ మూవీ రివ్యూ
nithin chal mohanaranga movie review
  • నటీనటులు : నితిన్, మేఘా ఆకాష్
  • సంగీతం : తమన్
  • దర్శకత్వం : కృష్ణ చైతన్య
  • నిర్మాతలు : త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డి
  • ఆసియానెట్ రేటింగ్ : 3/5

 

లై మూవీ తర్వాత నితిన్, మేఘా కాష్ లు జంటగా కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ చల్ మోహన రంగ. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డిల సంయుక్త నిర్మాణంలో రూపొందిన ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథను అందించిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి రంగస్థలం థియేటర్స్ లో వుండగానే రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

 

కథ :

మోహన రంగ (నితిన్) ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన యువకుడు. అమెరికా వెళ్తే డాలర్లు సంపాదించి లైఫ్ లో సెటిలైపోవచ్చని భావించి అనేక ప్రయత్నాలు చేసి చివరికి అమెరికా వెళ్తాడు. అక్కడే అతనికి మేఘా సుబ్రహ్మణ్యం (మేఘా ఆకాష్) పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. కొంత కాలానికి ఆ స్నేహం ప్రేమ అని తెలుసుకుంటారు ఇద్దరు. అయితే తమ ఇద్దరి లైఫ్ స్టైల్ వేరు అని భావించి పరస్పరం ప్రేమని వ్యక్తీకరించుకోకుండానే విడిపోతారు. అలా విడిపోయిన వారిద్దరికీ జీవితంలో ప్రశాంతత ఉండదు. అలా దూరమైన ఇద్దరూ తమ ప్రేమ నిజమైందేనని, ఎలా కలుసుకున్నారు అనేదే తెరపై నడిచే కథ.

 

విశ్లేషణ :

సినిమాకు హీరో నితిన్ పాత్ర చిత్రీకరణ ప్రధాన బలంగా నిలిచింది. నితిన్ నార్మల్ మధ్యతరగతి మనస్తత్వం కలిగిన కుర్రాడు మోహన్ రంగ పాత్రలో కనిపించడం బాగుంది. ఆ పాత్రలో నితిన్ నటన కూడ ఆకట్టుకుంది. దర్శకుడు కృష్ణచైతన్య కథానాయకుడి పాత్రలో అమాయకత్వాన్ని, నిజాయితీని మేళవించి తెరపై అవిష్కరించిన తీరు ఆకట్టుకుంది. హీరోయిన్ మేఘా ఆకాష్ కూడ తనదైన శైలిలో నటన ప్రదర్శించి మెప్పించింది. మేఘా, నితిన్ కు మధ్య నడిచే ఫన్నీ సీన్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఫస్టాఫ్ ఆరంభం నుండి చివరి వరకు అన్ని పాత్రల ద్వారా హాస్యాన్ని పండించటంలో దర్శకుడి ప్రయత్నం సఫలమైంది. పాటలు ఆకట్టుకుంటాయి. త్రివిక్రమ్ అందించిన కథ సాధారణమైనదే అయినా సెన్సిబుల్ గా అనిపించింది. సినిమాలో చాలా చోట్ల త్రివిక్రమ్ ప్రాసలతో కూడిన డైలాగ్స్ బాగానే పేలాయని చెప్పాలి.

అయితే ఫస్టాఫ్ మొత్తం కామెడీ, హీరో పాత్రతో,  డైలాగులతో నెట్టుకొచ్చిన ఆయన ద్వితీయార్థంలో సినిమాను పతాకస్థాయికి తీసుకెళ్లలేకపోయారు. ప్రేమ కథ ఆరంభం ఎలా అయితే సాదాసీదాగా ఉందో ప్రయాణం, ముగింపు కూడ అలానే నార్మల్ గానే ఉన్నాయి. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, బలమైన రొమాంటిక్ సన్నివేశాలు, విడిపోయాక వారి ఎడబాటును ప్రేక్షకుడు అనుభూతి చెందేలా చేసే భావోద్వేగపూరితమైన పరిస్థితులు కానీ కనబడలేదు. అసలు హీరో హీరోయిన్లు ఒక చిన్నపాటి క్యాజువల్ మీటింగ్ కు ఒకరు రాలేదని మరొకరు అపార్థం చేసుకుని విడిపోవడం కొంత సిల్లీగా అనిపిస్తుంది. ఇక ద్వితీయార్థంలో కొన్ని ఫన్నీ సీన్స్ మినహా ప్రేక్షకుడ్ని కదిలించే సన్నివేశాలు పెద్దగా లేకపోవడంతోసినిమా నీరసంగా కదులుతున్న ఫీలింగ్ కలిగింది.

దర్శకుడు కథకు తగిన విధంగా సీన్స్ లో మరింత డెప్త్ వుండేలా చేసుంటే బాగుండేది. ఇక నటరాజన్ సుబ్రమణియం అందించిన సినిమాటోగ్రఫీ, ఫారిన్ లొకేషన్స్, ఊటీలో తెరకెక్కించిన సీన్స్ ఆహ్లాదంగా అనిపిస్తాయి. తమన్ అందించిన పాటల సంగీతం, బ్యాక్ గౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. నిర్మాతలుగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డిలు పాటించిన నిర్మాణ విలువలు పర్ ఫెక్ట్ గా వున్నాయని చెప్పొచ్చు.

 

చివరగా :

లవ్ లో ఎమోషన్ తగ్గినా.. కామెడీ అలరిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios