చాలా కాలం తర్వాత గతేడాది ఫిబ్రవరిలో వచ్చిన ‘భీష్మ’తో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు యంగ్‌ హీరో. భీష్మ కంటే ముందు నితిన్‌ చేసిన లై, చల్‌మోహన్‌రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి.దీంతో కొంత గ్యాప్‌ తీసుకొన్న నితిన్‌.. ఒకేసారి రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో ఒకటి భీష్మ అయితే మరొకటి  చెక్‌. భీష్మతో పాటు చెక్‌ కూడా విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్‌ వల్లనిలిచిపోయింది. దాదాపు ఏడాది గ్యాప్‌  తర్వాత ఫిబ్రవరి 26  చెక్‌ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. వైవిధ్యభరిత చిత్రాలను తెరకెక్కించడంలో సిద్దహస్తుడైన చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. 

దీనికి తోడు టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది.వైవిధ్యమైన ఇతివృత్తంతో వచ్చిన ‘చెక్‌’పై నితిన్‌ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. అయితే ఆ అంచనాలు అన్నీ తిరగబడ్డాయి. పాటలు, ఫైట్స్, కామెడీ.. ఇలా రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా వచ్చిన ‘చెక్‌’ని ప్రేక్షకులుకు పెద్దగా ఎక్కలేదు. రివ్యూలు డివైడ్ టాక్ రావటంతో థియోటర్స్ లో చాలా మంది చూడలేదు. అయితే యేలేటి సినిమా ఒక్కసారైనా చూడాలనుకునేవాళ్ళంతా ఓటీటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేఫద్యంలో ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్‌ అవుతోంది. మే 14 నుంచి సన్‌ నెక్స్ట్‌లో ప్రసారం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. 

తన తెలివితేటలతో చిన్నచిన్న దొంగతనాలు చేసే హీరో ఉగ్రదాడి కేసులో ఎలా ఇరుక్కున్నాడనేది కథ. కాగా ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరో ప్రేయసిగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ న్యాయవాదిగా నటించారు. సంపత్‌ రాజ్‌, సాయిచంద్‌, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ ముఖ్య పాత్రల్లో కనిపించారు. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించాడు. కల్యాణీ మాలిక్‌ సంగీతం అందించాడు. ఏదేమైనా కోవిడ్‌ భయంతో థియేటర్‌లో చూడలేని వాళ్లు, లేదా ఇంకోసారి చూడాలనుకునేవాళ్లు ఇప్పుడు  సన్‌ నెక్స్ట్‌ యాప్‌లో చూసేయొచ్చు.