ప్రభాస్ నటిస్తోన్న 'సాహో' సినిమా మొదటి నుండి ఓ డబ్బింగ్ సినిమాను తలపిస్తోంది. సినిమా విషయంలో చిత్రబృందం బాలీవుడ్ కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందని అనిపిస్తోంది. దీంతో సినిమాకు సంబంధించి ఏ టీజర్ విడుదలైనా ఓ డబ్బింగ్ టీజర్ లేదా పాట చూస్తోన్న ఫీలింగ్ కలుగుతోంది.

రీసెంట్ గా విడుదలైన 'సైకో.. సయ్యాన్' పాటని ఎంతగా ట్రోల్ చేశారో తెలిసిందే. తాజాగా చిత్రబృందం సినిమాలో రొమాంటిక్ సాంగ్ 'నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే' అనే రొమాంటిక్ సాంగ్ టీజర్ ని విడుదల చేసింది. కృష్ణ కాంత్ సాహిత్యం అందించిన ఈ పాటను హరిచరణ్ శేషాద్రి, తులసీ కుమార్ ఆలాపించారు. లిరిక్స్ బాగానే ఉన్నప్పటికీ ఏదో తెలియని లోటు టీజర్ లో కనిపిస్తుంది. 

పూర్తి పాట విడుదలైతే కానీ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చెప్పలేని పరిస్థితి. టీజర్ లో మాత్రం ప్రభాస్ గెటప్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ పాట టీజర్ ని విడుదల చేశారు. 'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. యువి క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్ లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్ట్ 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.