రామ్‌ గోపాల్ వర్మ కంపెనీ నుంచి వస్తున్న తాజా చిత్రం పవర్‌ స్టార్‌. పవన్‌ కళ్యాణ్‌ జీవితంపై సెటైరికల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా అభిమానుల్లో కలవరం కలిగిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు వర్మ. గత ఎన్నికల తరువాత పవన్‌ పరిస్థితిని ప్రతిభింభించేలా సన్నివేశాలను రూపొందించాడు. అయితే ఈ ట్రైలర్‌పై సినీ జనాలు పాజిటివ్‌గా స్పందిస్తుంటే పవన్‌ అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు.

తాజాగా యంగ్ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ కూడా పవన్‌కు మద్ధతుగా ట్వీట్  చేశాడు. `శిఖరం చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ శిఖరం తల తిప్పి చూడదు. మీకు అర్ధం అయ్యిందిగా` అంటూ కామెంట్ చేశాడు నిఖిల్‌. అయితే నిఖిల్‌ ట్వీట్‌పై నెటిజెన్లు ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. అయితే ఆ రియాక్షన్స్‌లో ఎక్కువగా నెగెటివ్‌ స్పందనలే ఉన్నాయి. గతంలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ అనే సినిమాను వర్మ రూపొందించినప్పుడు మాట్లాడిని వారు ఇప్పుడు మాట్లాడటం ఏంటి అంటున్నారు సినీ అభిమానులు.

ముఖ్యంగా పవన్‌ రాజకీయాల్లో దారుణంగా ఫెయిల్ అవ్వటాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్‌లు చేస్తున్నారు. 120 స్థానాల్లో డిపాజిట్‌లు రాకపోవటం, రెండు చోట్ల పోటీ చేసిన పవన్‌ ఒక్క చోట కూడా గెలవలేకపోవటం లాంటి అంశాలను ప్రధానంగా ప్రస్థావిస్తూ పవన్‌ మీద విమర్శలకు దిగుతున్నారు. క్వాలిటీ పరంగా వర్మ రూపొందించిన పవర్‌ స్టార్ సినిమాకు మంచి స్పందన వస్తోంది. వర్మ మేకింగ్‌ స్టైల్‌, కెమెరా యాంగిల్స్‌, ఆర్టిస్ట్‌ సెలక్షన్‌ మరోసారి వావ్‌ అనిపించేలా ఉందంటున్నారు విశ్లేషకులు.